కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Published Fri, Nov 20 2020 4:14 AM

Nagrota encounter jammu kashmir terrorists killed toll plaza in Jammu Kashmir - Sakshi

జమ్మూ/శ్రీనగర్‌: కశ్మీర్‌లో భారీస్థాయి దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు జమ్మూ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీపీ) ముకేశ్‌  చెప్పారు.

జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్‌ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 28వ తేదీన, డిసెంబర్‌ 22న జిల్లా అభివృద్ధి మండళ్లకు జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు తాము అత్యంత అప్రమత్తతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల నేతలకు వేర్వేరుగా భద్రత కల్పించడం కష్టసాధ్యమైనందున, వారు వెళ్లే ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement