
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో అత్యధిక భాగం స్వల్ప లక్షణాలు కలిగినవేనని, బాధితులు గృహ సంరక్షణలో చికిత్స పొందుతున్నారని ఉన్నతవైద్యాధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్-19(COVID-19) కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి (డీహెచ్‌ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డీసీహెచ్‌ఎస్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్ జనరల్‌తో సమీక్షించారు.
కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం తేలికపాటివి, గృహ సంరక్షణలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు సంబంధించి ఈ సమీక్షలో చర్చించారు. కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, బహుళ ఏజెన్సీల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్-19 వేరియంట్ ఎన్‌బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్‌ఎప్.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 సబ్‌వేరియంట్‌లను ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్‌లు ఇవేనని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20శాతం) ఉన్నాయి.
మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో ఒకటి నిర్ధారితమయ్యాయి. బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. కేరళలో మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో తీవ్రమైన డయాబెటిస్‌తో బాధపడుతున్న కోవిడ్-19 రోగి అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. తాజాగా ముంబైలో ఎనిమిది కొత్త వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ