రోగాలను తాగేస్తున్నామా?.. లీటర్‌ నీటిలో లక్షల్లో మైక్రో ప్లాస్టిక్‌ కణాలు | More than 10 lakh plastic water bottles are sold worldwide every minute | Sakshi
Sakshi News home page

రోగాలను తాగేస్తున్నామా?.. లీటర్‌ నీటిలో లక్షల్లో మైక్రో ప్లాస్టిక్‌ కణాలు

Oct 10 2024 6:09 AM | Updated on Oct 10 2024 9:15 AM

More than 10 lakh plastic water bottles are sold worldwide every minute

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10 లక్షలకుపైగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకం

ఒక లీటర్‌ నీటిలో దాదాపు  3 లక్షల మైక్రో ప్లాస్టిక్‌ కణాలు

అనేక రోగాలకు ఇవి కూడా కారణం

పర్యావరణంపై తీవ్ర ప్రభావం

బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ అధ్యయనంలో వెల్లడి  

సాక్షి, సెంట్రల్‌ డెస్‌్క: హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేస్తే వాటర్‌ బాటిల్‌.. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్‌ బాటిల్‌.. ప్రయాణాల్లో దాహం వేస్తే వాటర్‌ బాటిల్‌.. ఇలా ఇబ్బడిముబ్బడిగా వాడేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ఈ విషయం బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

తాగునీరు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లయినా తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నీళ్లు తాగుతున్నారా, లేదా అని చూసుకుంటారు కానీ.. దేనిలో తాగుతున్నామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ విస్మరిస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామనే భావనతో రోజువారీ జీవితంలో ఎడాపెడా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు కొనేసి ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకు పైగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను వినియోగిస్తుండగా.. ఈ ధోరణి భవిష్యత్తులో విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, వాతావరణం పరంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అధ్యయనం వెల్లడించింది. 

ఎందుకిలా? 
ప్రపంచవ్యాప్తంగా కుళాయి నీటి నాణ్యత మీద ప్రజలకు నమ్మకం లేకపోవడమే వాటర్‌ బాటిళ్ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని అధ్యయనంలో తేలింది. అలాగే ఇవి ఎక్కడపడితే అక్కడ సులభంగా అందుబాటులో ఉండటం, వాటి ధర కూడా తక్కువగా ఉండటం, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనువుగా ఉండటం మరో కారణమని నివేదిక తెలిపింది.  
 
లీటర్‌ నీటిలో  3 లక్షల మైక్రో ప్లాస్టిక్‌ కణాలు..  
ప్లాస్టిక్‌ బాటిళ్ల నుంచి.. అందులోని నీటిలోకి మైక్రో ప్లాస్టిక్‌లు, బీపీఏ(బిస్‌ఫెనాల్‌–ఏ) తదితర హానికర రసాయనాలు విడుదలవుతుంటాయి. ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌లో లక్ష నుంచి మూడు లక్షల వరకు మైక్రో ప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్లు తేలిందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 90 శాతం నానో ప్లాస్టిక్‌ కణాలే. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. పునరుత్పత్తి హార్మోన్లు, థైరాయిడ్‌ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నివేదిక తెలిపింది. రక్తపోటు, గుండె, మధుమేహం, ఊబకాయంతో పాటు మానవ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. 

పర్యావరణంపై ప్రభావం.. 
పర్యావరణం మీద అత్యంత ప్రభావం చూపిస్తున్న వాటిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా ఒకటి. సముద్ర కాలుష్య కారకాల్లో మొదటి స్థానంలో ప్లాస్టిక్‌ సంచులు ఉండగా.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లది రెండో స్థానం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 శాతం ప్లాస్టిక్‌ బాటిళ్లు మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నాయని తెలిపింది. మిగిలిన 70 శాతం నేలలో, నీటిలో చేరి పర్యావరణానికి, అనంత జీవరాశికి అనర్థం కలుగజేస్తున్నాయని వెల్లడించింది. 

అలాగే ప్రతి లీటర్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌ కోసం 1.39 లీటర్ల నీటిని ఉపయోగిస్తూ.. నీటిని కూడా వృథా చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు ఏటా 600 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయని పేర్కొంది. తద్వారా వాతావరణ మార్పులకు దోహద పడుతున్నాయని వెల్లడించింది.

ఏం చేయాలి..? 
‘ప్రభుత్వాలు ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని విస్త్రతంగా అందుబాటులోకి తీసుకురావాలి. దాని మీద ఉన్న అపోహలు తొలగించాలి. ప్లాస్టిక్‌ బాటిళ్లు వినియోగించకుండా అవగాహన కలి్పంచాలి. వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలి. అలాగే ప్లాస్టిక్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా మట్టి, రాగి, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ నీటి సీసాలను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement