ఆ ఊరిలో భర్త చనిపోతే.. ఇక బొట్టు, గాజులు తీయాల్సిన అవసరం లేదు!

Maharastra Village Herwad Bans Widowhood - Sakshi

భర్త అకాల మరణం చెందితే అది భార్య తప్పా?, అందుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? ముమ్మాటికీ కాదు. అయితే విధవత్వం విషయంలో మాత్రం కట్టుబాట్లనేవి మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. భర్త చనిపోతే.. ఆమె మంగళసూత్రం తొలగించి, గాజులు పగలకొట్టి, నుదిటి మీద తిలకం చెరిపేసి.. అప్పటికే పుట్టెడు బాధలో ఉండే స్త్రీ మూర్తికి మరింత శోకం అందిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఆచారాలు నిషేధించుకుంది ఇక్కడో పల్లె. 

మహారాష్ట్ర కోల్హాపూర్‌ జిల్లా షిరోల్‌ తాలుకా హెర్‌వాద్‌(డ్‌) అనే గ్రామం.. తాజాగా ఓ తీర్మానం చేసింది. భర్త చనిపోయిన ఆడవాళ్లు.. సంప్రదాయాలను పక్కనపెట్టి నచ్చినట్లుగా, సమాజంలో గౌరవంగా జీవించేందుకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానానికి మే 4వ తేదీన గ్రామ పంచాయితీ సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా టైంలో.. 
కరోనా టైంలో ఈ ఊరిలో మరణాలు చాలానే సంభవించాయట. అందులో పాతికేళ్లలోపు యువకులే ఎక్కువగా ఉన్నారట. దీంతో చిన్నవయసులోనే ఎంతో మంది వితంతువులుగా మారిన పరిస్థితి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా.. వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి గ్రామస్తులు భరించలేకపోయారు. ‘‘తమ తప్పు లేకున్నా.. పశ్చాత్తాపంతో కుంగిపోయిన బిడ్డలను చూశాం. తమ మధ్యే ఉంటూ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూశాం. అందుకే వాళ్ల జీవితాలను మార్చే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’’ని గ్రామ సర్పంచ్‌ శ్రీగోండ పాటిల్‌ చెప్తున్నారు.

అయితే ఈ ప్రయత్నం అంత సులువుగా కావడానికి అంగన్‌వాడీ సేవికాస్‌, ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందని అంటున్నాడాయన. ఈ తీర్మానం విషయంలో మహాత్మా ఫూలే సోషల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రమోద్‌ జింగాడే అందించిన ప్రోత్సాహం మరిచిపోలేమని, ఇది షాహూ మహరాజ్‌కు నివాళి అని అంటున్నారు హెర్‌వాద్‌ గ్రామ ప్రజలు. 

ఇక ఈ నిర్ణయంపై జిల్లా పరిపాలన విభాగం సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు మంత్రి సతేజ్‌ పాటిల్‌ స్పందిస్తూ.. శివాజీ పుట్టిన గడ్డ మీద ఆడవాళ్ల గౌరవానికి భంగం కలగకూడదని, ఈ మేరకు.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న హెర్‌వాద్‌ ప్రజలకు వందనాలు అని, కొందరికి ఇది చెంపపెట్టులాంటి సమాధానమని వ్యాఖ్యానించారు. మరికొన్ని గ్రామాలు కూడా ఇలాంటి బాటలో వెళ్తే.. మంచిదని అభిప్రాయపడ్డారాయన.

:::సాక్షి ప్రత్యేకం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top