వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి..

Maharashtra Father beaten up by cops to hand over chit to son - Sakshi

సుద్ద మొద్దు అయిన కొడుకును ఎలాగైనా పరీక్ష గండం గట్టెక్కించాలని ఆ తండ్రి తాపత్రయపడ్డాడు. నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి చిట్టీలు అందించేందుకు యత్నించాడు. కానీ, ఆ తండ్రికి చివరకు చేదు అనుభవం ఎదురైంది. సడన్‌ ఎంట్రీ ఇచ్చిన ఖాకీలు ఆ తండ్రిని పరిగెత్తించి మరీ చితకబాదారు. సోషల్‌ మీడియాలో ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. 

మహారాష్ట్రలో స్టేట్‌ బోర్డు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. ఈ తరుణంలో జలగావ్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడుక్కి చిట్టీలు అందిస్తున్న సమయంలో.. ఎగ్జామ్‌ ఇన్విజిలేటర్‌ ఆ విషయాన్ని గమనించి బయట ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. వాళ్లు పరీక్షా కేంద్రం వెనక నుంచి పరిగెడుతున్న ఆ తండ్రిని దొరకబుచ్చుకుని.. చితకబాదారు. కిందపడినా కూడా వదలకుండా లాఠీలతో బాదేశారు. శనివారం  ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం పన్నెండవ తరగతి లెక్కల పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలు రెండూ లీక్‌ కావడం కలకలం సృష్టించిది.  బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలుకాలో ఈ లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ లీక్‌ ప్రభావం పరీక్ష మీద పడలేదని బోర్డు ప్రకటించుకోవడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top