సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్‌ | Maharashtra CM Devendra Fadnavis Reacts on Saif Ali Khan Incident | Sakshi
Sakshi News home page

సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్‌

Jan 16 2025 4:44 PM | Updated on Jan 16 2025 5:16 PM

Maharashtra CM Devendra Fadnavis Reacts on Saif Ali Khan Incident

నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు.  

మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది.  

దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్‌ వద్దే ఉంది.

ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్‌ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.  దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. 

అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.

ఊహాజనిత కథనాలొద్దు
ఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్‌ టీం కోరుతోంది. ‘‘సైఫ్‌ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది.  సైఫ్‌ భార్య కరీనా కపూర్‌, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు.  కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement