
విచారణలో తల్లీకూతుళ్ల వెల్లడి
యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది.
గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్‌సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు.