ఢిల్లీలో కలకలం రేపుతున్న టెర్రర్‌ నోట్‌ | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కలకలం రేపుతున్న టెర్రర్‌ నోట్‌

Published Tue, Feb 2 2021 7:09 PM

A Letter terror in New Delhi - Sakshi

ఢిల్లీ: ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పేలుడు చోట ఓ లేఖ లభ్యమైంది. అది హెచ్చరిస్తూ కావాలనే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ‘రోజులు లెక్కపెట్టుకోండి.. పెద్ద పత్రీకారం కోసం సిద్ధంగా ఉండండి’ అని రాసి ఉండడంతో కలకలం రేపుతోంది. అంటే రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందని ఆ రాతను బట్టి చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ విధించిన సంగతి తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం బయట జనవరి 29వ తేదీన అత్యల్ప తీవ్రత కలిగిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇది ముందస్తుగా హెచ్చరిస్తూ జరిపిన దాడిగా పోలీస్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు చోట ‘ఇండియా హిజ్బుల్లా’ పేరుతో ఉన్న ఒక లేఖ లభించింది. దీనిలో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కాను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఇజ్రాయెల్ రాయబారి కదలికలను పరిశీలిస్తున్నట్లు, ఇరాన్‌ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే, ఇరాన్ కమాండర్ ఖాసిమ్‌ సోలైమానితో సహా కొంతమంది ఉన్నత ఇరానియన్ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం. మీ రోజులను లెక్కపెట్టుకోండి’ అని చేతితో రాసిన లేఖలో ఉందని తెలుస్తోంది. ‘మీ ప్రతి క్షణం మాకు తెలుసు. మీరు మీ చివరి రోజులను లెక్కించడం ప్రారంభించండి. మీరు మాత్రమే కాదు, మీ భాగస్వాములు కూడా మా రాడార్‌లో ఉన్నారు. ఇది ట్రైలర్‌ మాత్రమే’ అని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు దీనిపై ఆరా తీస్తున్నాయి. ఈ బాంబు దాడిని ఇజ్రాయెల్‌ దేశం కూడా ఖండించిన విషయం తెలిసిందే. దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపింది.

Advertisement
Advertisement