వైరల్‌ వీడియో.. బాల్యాన్ని గుర్తు చేస్తోన్న చిన్నారి

Kid Crying At the Thought of Schools Reopening - Sakshi

సాధారణంగా చిన్న పిల్లలను స్కూల్‌కు పంపించడం సవాలుతో కూడుకున్న పని. పాపం చిన్నారులకేమో ఇంటి దగ్గరే ఉండి ఆడుకోవాలని ఉంటుంది. కానీ పెద్దవాళ్లమో ఇప్పటినుంచే ఆ పిల్లలు ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నట్లు భావిస్తారు. ఏడ్చి గీ పెట్టినా వినకుండా తీసుకెళ్లి స్కూల్‌లో దిగబెట్టి వస్తారు. పాపం బుజ్జగించి... పంపిద్దామని ఆలోచించరు చాలా మంది. అయితే మహమ్మారి కరోనా వల్ల పిల్లలకు ఇంత వరకు ఎన్నడు లేనన్ని సెలవులు లభించాయి. దాదాపు మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో విద్యాసంస్థలు అన్ని మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా ఎలా ఉన్నా.. పిల్లలు మాత్రం చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే తాజగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో స్కూల్స్‌ ఓపెన్‌ చేస్తారనే వార్త పట్ల చాలా మంది పిల్లలు ఎలా ఫీలవుతున్నారో.. ఎంత బాధపడుతున్నారో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులకు తమ బాల్యం ఒక్కసారి కళ్లముందు మెదిలింది. (ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్‌ ఓపెన్‌)

మాజీ ఫైనాన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ అరవింద్‌ మయారం తన ట్విట్టర్‌లో ‘ఆబ్‌ క్యా కరేన్‌’(ఇప్పుడేలా) అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోను చూసి నెటిజనలు తెగ నవ్వుకుంటున్నారు. దీనిలో ఓ తల్లి తన కుమారుడిని చేతులు ముందుకు చాచి తాను చెప్పినట్లు చెప్పమంటుంది. తల్లి చెప్పినట్లే పిల్లాడు చేతులు ముందుకు చాచి ‘అల్లా ఈ 15 నుంచి స్కూల్స్‌ రీఓపెన్‌ కావాలని నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ తల్లి చెప్పిన మాటలను ఒక్కొక్కటి వల్లే వేస్తాడు. ఆ తర్వాత తల్లి త్వరలోనే స్కూల్స్‌ రీఓపెన్‌ చేయబోతున్నారని చెప్తుంది. అది విని ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభిస్తాడు. పాపం స్కూల్‌ తెరుస్తారనే ఆలోచనే తనకి నచ్చడం లేదు. దాంతో ఏడుపు తన్నుకొస్తుంది. కంట్రోల్‌ చేసుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఇందుకు సంబంధించి చిన్నారి ఎక్స్‌ప్రెషనన్స్‌ నవ్వు తెప్పిస్తాయి. ఇది చూసిన నెటిజనుల​ ‘వీడిని చూస్తే.. చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top