నాన్నా! భయమేస్తోంది.. కన్నీరు పెట్టించిన విస్మయ కేసులో దోషిగా భర్త కిరణ్‌

Kerala Vismaya Case: Kiran Found Guilty Victim Audio Viral - Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విస్మయ వరకట్న వేధింపుల హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త కిరణ్‌ను దోషిగా ప్రకటించింది కొల్లాం న్యాయస్థానం. అంతేకాదు కీలక ఆధారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 22 ఏళ్ల విస్మయ అత్తింటి వేధింపులు భరించలేక.. తన ఇంటికి ఫోన్‌ చేసిన మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. 

‘‘నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచాలని చూస్తే.. మీరు నన్ను మళ్లీ చూడలేరు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంక భరించలేను. అచా (నాన్న)..  నాకు వెనక్కి వచ్చేయాలని ఉంది. నన్ను కొడతారని భయంగా ఉంది’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైన వాయిస్‌ ఆ క్లిప్‌లో(మలయాళంలో) ఉంది. అయితే తండ్రి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. 

కేరళ కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్‌ డిగ్రీ స్టూడెంట్‌ అయిన విస్మయ నాయర్‌.. కిందటి ఏడాది జూన్‌ 21న కొల్లాం సస్తమ్‌కొట్ట సమీపంలోని సస్తమనాదాలో ఉన్న అత్తగారింట్లో విగతజీవిగా కనిపించింది. అదనపు కట్న వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేదింపులతో పాటు గృహ హింస కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీలోని సెక్షన్‌లతో పాటు వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్‌లు చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ వ్యవహారంతో విస్మయ భర్త కిరణ్‌ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఊడింది. ఇంతకాలం బెయిల్‌ మీద బయట ఉన్నాడతను.

ఇక మోటార్‌ వెహికిల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే కిరణ్‌కి.. కొల్లాంకు చెందిన విస్మయ వీ నాయర్‌ను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు పెద్దలు. అయితే అదనపుకట్నం కోసం ఆమెను వేధించసాగాడు కిరణ్‌. అప్పటికీ కొత్త కారు కొనిచ్చినప్పటికీ.. తాను ప్రభుత్వ ఉద్యోగినని, వేరే మోడల్‌ కారు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో.. ఆమె ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడం విషాదాన్ని నింపడంతో పాటు దేశవ్యాప్తంగా వరకట్న మరణాలపై చర్చకు దారి తీసింది.

ఇక  విస్మయ కేసులో.. ఇవాళ (సోమవారం, మే 23) తీర్పు నేపథ్యంలో.. అతని బెయిల్‌ రద్దు అయ్యింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొల్లాం అదనపు సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆడియో, తాను వేధింపులకు గురైనట్లు ఫొటోలు పంపిన విస్మయ.. కీలక ఆధారాలను అందించినట్లు అయ్యింది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మంగళవారం అతనికి విధించబోయే శిక్షను ఖరారు చేయనుంది. ఈలోపే అధికారికమో, కాదో క్లారిటీ లేని ఈ ఆడియో క్లిప్‌ వైరల్‌ అవుతుండడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top