ప్చ్‌ విజయన్‌.. ఎలా తట్టుకుంటారో? | Kerala Politics Flips CMs To Opposition, VD Satheesan Set To Become CM As Pinarayi Vijayan Moves To Opposition Role | Sakshi
Sakshi News home page

ప్చ్‌ విజయన్‌.. ఎలా తట్టుకుంటారో?

May 15 2026 7:59 AM | Updated on May 15 2026 10:35 AM

Kerala politics flips CMs to Opposition

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామన్న పినరయి విజయన్‌ కల నెరవేరలేదు. ఘోర ఓటమితో.. కేరళంలో ఎల్‌డీఎఫ్‌ దశాబ్దకాల పాలన ముగిసింది. దీనికి తోడు అక్కడి రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని మలుపు ఒకటి చోటు చేసుకుంది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించింది. 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుంది ఈ కూటమి. ఇందులో కాంగ్రెస్‌ 63 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తీవ్ర తర్జన భర్జనల తర్వాత వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. ఎల్‌డీఎఫ్‌ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. అందులో సీపీఎం 26, సీపీఐ 8, ఆర్జేడీ 1 సీటు గెలిచాయి. మరోవైపు బీజేపీ 3 సీట్లు సాధించి కేరళ చరిత్రలోనే మెరుగైన ఫలితం అందుకుంది.

ఈ ఫలితాలతో.. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పినరయి విజయన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారబోతున్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పినరయి విజయన్‌ను శాసనసభా పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ఈ విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఓటమికి విజయన్‌ నాయకత్వ శైలే కారణమని..  ప్రతిపక్ష నేతగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని.. మారుతున్న రాజకీయాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మిత్రపక్షం సీపీఐలోని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సీపీఎం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయన్‌నే ప్రతిపక్ష నేతగా నిర్ణయించింది.

సీపీఎం చరిత్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేతగా మారడం కొత్త విషయం కాదు.  ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, వీఎస్‌ అచ్యుతానందన్‌లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పినరయి విజయన్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 

ప్రతిపక్ష నేతగా విజయన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాధించిన 61 ఏళ్ల వీడీ సతీశన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇంతకాలం అసెంబ్లీలో ప్రత్యర్థిగా సతీశన్‌ దూకుడు చూపించేవారు. ఆ దూకుడే విజయన్‌ సర్కార్‌ను ఇరకాటంలో పడేసేది. కానీ ఇప్పుడు 82 ఏళ్ల వయసులో విజయన్‌కి అంత ఓపిక ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. మరోవైపు.. ఈ పాత్రల మార్పు కేరళ అసెంబ్లీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. అదే సమయంలో అక్కడి ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటమి తర్వాత కూడా పార్టీకి పెద్దదిక్కుగా మారిన పినరయి.. ప్రతిపక్షంలో తన శక్తిని ఎలా వినియోగిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement