
దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్.. వారం కిందట గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో రీల్ రూపేణా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
గురువాయూర్ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..

రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.
మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
జాస్మిన్ జాఫర్(25).. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది.