Karnataka: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం

Karnataka Sister Hold Hands Die Due To landslide - Sakshi

స్వార్థంతో కూడిన ప్రపంచంలో బంధాలకు విలువ ఏమాత్రం?. అండగా ఉండాల్సిన వాళ్లే.. కష్టకాలంలో కానీవాళ్లుగా మారిపోతున్నారు. అలాంటిది మరణంలోనూ ఆ బంధం ఒక్కటిగా కనిపించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కారణం.. అవి కల్లాకపటం ఎరుగని పసిహృదయాలు కాబట్టి. 

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో మంగళవారం వెలుగుచూసిన విషాద ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అయితే.. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అక్కడి దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన ఆ పిల్లలు.. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

శ్రుతి(11), జననశ్రీ(6) అక్కాచెల్లెళ్లు. దక్షిణ కన్నడ జిల్లా సుబ్రమణ్యలోని కుసుమధారలో ఉంటోంది వీళ్ల కుటుంబం. సోమవారం సాయంత్రం సుబ్రమణ్యలో భారీ వర్షం కురిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆ సమయంలో ఇంటి వరండాలో కూర్చుని చదువుకుంటోంది శ్రుతి. భారీ శబ్దానికి భయంతో ఇంట్లోకి పరిగెత్తింది. అక్కను చూసి వెంటే చెల్లి జననశ్రీ కూడా లోపలికి వెళ్లింది. అయితే వంట గదిలో ఉన్న ఆ పిల్లల తల్లి.. ఆ శబ్దానికి బయటకు వచ్చేసింది. పిల్లలు కూడా బయటే ఉన్నారు కదా ఆ తల్లి పొరపడింది. సరిగ్గా అదే సమయంలో పైన ఉండే కొండచరియలు విరిగి.. ఆ ఇంటిపై పడ్డాయి.  అంతే..  

భారీ వృక్షం పడిపోవడం, దారులన్నీ నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. దీంతో మరుసటి రోజే శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. నాలుగైదు గంటలు శ్రమించి.. చివరకు ఆ చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. భయంతో ఒకరినొకరు పట్టుకుని ఉంటారని భావిస్తున్నారు సిబ్బంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

ఉత్తర కన్నడ జిల్లా భక్తల్‌ తాలుకా ముట్టాలిలో కొండ చరియలు విరిగిపడిన మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top