ఈ అవ్వది పెద్ద మనసు.. అందుకే ఆ ఊరంతా ఆమెకు మొక్కుతోంది మరి!

Karnataka Old Lady Donates Crore Worth Land For School - Sakshi

ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్లకు సాయం చేశారా?.  సపోజ్‌.. మీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉందనుకోండి!.. ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? ఇక్కడో బామ్మ మరో ప్రస్తావన లేకుండా దానం చేసేసింది. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. 

హుచ్చమ్మ చౌద్రి.. వయసు 75 ఏళ్లు. ఉండేది హవేరీ జిల్లా కునికేరి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే బసప్ప చౌద్రిని పెండ్లి చేసుకుని ఆ ఊరికి కాపురం వచ్చింది. ఎన్నో ఏళ్లు గడిచినా పాపం పిల్లలు కలగలేదు ఆ జంటకు.  ఒకరికొకరు తోడుగా పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతికేవాళ్లు. ముప్ఫై ఏళ్ల క్రితం బసప్ప చనిపోయాడు.  అప్పటి నుంచి హుచ్చమ్మ ఒంటరిది అయ్యింది. కానీ, ఆమె కాయకష్టం ఆగలేదు. 

ఊరికి కష్టం.. 
పొలం పనులు చేసుకుంటున్న హుచ్చమ్మకి.. ఒకరోజు పంచాయితీలో పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం చెవిన పడింది. స్కూల్‌లో బడి లేదు. ఎక్కడైనా స్థలం దొరికితే కట్టాలని అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ ముందుకొచ్చింది. తన ఎకరం స్థలం తీసుకోమని చెప్పింది. అది వినగానే అందరూ కంగుతిన్నారు. నిజంగానే అంటున్నావా హుచ్చమ్మా? అన్నారు. ‘మనస్ఫూర్తిగా..’ అంటూ కాగితాలపై సంతకాలు చేసేసింది ఆమె. అలా ఆ ఊరికి స్కూల్‌ వచ్చింది.

అటుపై పిల్లల ఆట స్థలం కోసం ఇబ్బంది పడకూడదని ఆ పక్కనే మరో ఎకరం కూడా ఇచ్చేసింది. ఈసారి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన  అధికారులు.. ఆమెకు ఆ స్థలం విలువ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ భూమిలో ఇనుము ధాతువు ఉందని, ఎకరం కనీసం అర కోటి రూపాయలకు తక్కువకు పోదని ఆమెకు వివరించారు. కానీ, నవ్వుతూ ఆ పెద్దావిడ ‘ ఆ డబ్బు నేనేం చేసుకోను అయ్యా.. ఆకలి తీర్చుకునేందుకు పని చేస్తున్నా.. సంపాదించుకుంటున్నా. ఇలాగైనా ఈ ఊరి బిడ్డలు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా’ అంటూ సంతకాలు చేసేసింది. 

హుచ్చమ్మ ఇప్పుడు అదే స్కూల్‌లో ఆమె మధ్యాహ్నన భోజన పథకం కింద వంట మనిషిగా పని చేస్తోంది. బడి బంద్‌ ఉన్న టైంలో పొలం పనులు చేసుకుంటోంది. బడిలో అంతా ఆమెను అజ్జీ(అవ్వ) అని పిలుస్తున్నారు. తల్లి ప్రేమను నోచుకోకపోయినా.. ఊరి బిడ్డలకు ప్రేమగా వండిపెడుతోంది. 300 మంది ఆప్యాయంగా అవ్వా అంటుంటే సరిపోదా? అంటూ బోసినవ్వులతో చెప్తోంది హుచ్చమ్మ. అందుకే ఆ అవ్వ సాయానికి ఊరంతా మొక్కుతోంది ఇప్పుడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top