రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి పిలుపు !

Karnataka Cabinet Expansion Would Take Time - Sakshi

కేబినెట్‌ విస్తరణపై కర్ణాటక సీఎం బొమ్మై

బెంగళూరు: కర్ణాటక కేబినెట్‌ విస్తరణ వ్యవహారంపై రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తనకు పిలుపు రావచ్చని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన శనివారం తిరిగి వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాలను కలిశారు. అయితే నడ్డాను శనివారం కలిసే అవకాశం రాలేదని, మళ్లీ పిలుపు రావచ్చని పేర్కొన్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి కేబినెట్‌ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ రెండు దశల్లో జరగనుందా అని మీడియా ప్రశ్నించగా, ఆ విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు.  

కొనసాగుతున్న లాబీయింగ్‌.. 
మంత్రులను ఎంపిక చేసే వ్యవహారంలో పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్‌ ప్రాంరభించారు. మాజీ మంత్రులు సైతం ఢిల్లీ వేదికగా తమ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు రమేశ్‌ జార్కిహోళి, ఎంపీ రేణుకాచార్య, మునిరత్నలు మాజీ సీఎం యడియూరప్పను ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ సీనియర్‌ నేత కె.ఎస్‌ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా యడియూరప్ప తొలగింపు జరిగాక తనను సీఎం చేయాల్సిందని, ఇప్పటికైనా తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందిగా పలువురి నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. నిర్ణయం హైకమాండ్‌ చేతుల్లో ఉందని అన్నారు.

మా వర్గం నుంచి ఎవరూ లేరు.. 
హవేరీ ఎమ్మెల్యే నెహరు ఒలేకర్‌ మాట్లాడుతూ.. రాబోయే కేబినెట్‌లో తనకు చోటు దక్కాలని తమ నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఓ అవకాశం రావడం ఇది మూడో సారి అని, నేతలు తనను దీవిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చాలవాడి వర్గం నుంచి ఇప్పటి వరకూ బీజేపీలో ఎవరికీ అవకాశం దక్కలేదని అన్నారు. కాంగ్రెస్‌లో తమ వర్గానికి గతంలో అవకాశం దొరికిందని అన్నారు. ఇప్పుడు అవకాశం రాకపోతే కాంగ్రెస్‌ వైపు వెళతారనే భయం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బీజేపీని కోరారు. ముఖ్యమంత్రి ఒక్కడే అన్ని వ్యవహారాలను నిర్వహించలేరని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top