నేడు రాష్ట్ర బంద్‌

Karnataka Bandh Over Maratha Board - Sakshi

సాక్షి, బెంగళూరు: మరాఠ ప్రాధికార ఏర్పాటును వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట నేడు (శనివారం) రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధం చేసుకుంది. బంద్‌కు ట్యాక్సీ, ఆటో, ఓలా, ఉబర్‌ సంఘాలు మద్దతు పలకడంతో రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. ఫుట్‌పాత్‌ వ్యాపారులు, ఏపీఎంసీ వ్యాపారులు  నైతిక మద్దతు ఇస్తున్నారు. బార్, మాల్స్‌ యాజమాన్యాల సంఘం కూడా కన్నడ సంఘాల పోరాటానికి మద్దతు ఇచ్చింది. బంగారు నగల దుకాణాల యజమానులు బంద్‌కు నైతిక మద్దతును ప్రకటించింది.  చిక్కమగళూరు, ధార్వాడ, విజయపుర, బళ్లారి, కొప్పళ, మైసూరు, కోలారు, చిక్కబళ్లాపురతో పాటు వివిధ జిల్లాల్లో కన్నడ సంఘాలు ధర్నా, ర్యాలీలకు సమాయత్తమయ్యాయి.   బస్సులను అడ్డుకోవడంతోపాటు రైల్‌రోకో చేపట్టాలని కర్ణాటక రక్షణా వేదిక నిర్ణయించింది.

బస్సులు తిరుగుతాయి
కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సులు యధా ప్రకారం  తిరుగుతాయని రవాణా శాఖ తెలియజేసింది. 

బంద్‌కు అనుమతి కోరలేదు
శివాజీనగర: శనివారం కర్ణాటక బంద్‌కు ఎవరూ అనుమతి కోరలేదని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. తాము కూడా కర్ణాటక బంద్‌కు అనుమతిని ఇవ్వలేదన్నారు. శనివారం బెంగళూరులో ఎలాంటి ర్యాలీలకు అవకాశం కల్పించేది లేదన్నారు. బంద్‌పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించినవారిపై చర్యలు తీసుకొంటామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా వహించామని తెలియజేశారు.  చదవండి: (న్యూ ఇయర్‌ జోష్‌కు బ్రేక్)‌

బెదరం, భయపడం 
శివాజీనగర: మరాఠ అభివృద్ధి ప్రాధికారను వ్యతిరేకిస్తూ చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను భగ్నం చేయడానికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కన్నడ చళవళి పక్ష అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్, డాక్టర్‌ రాజ్‌కుమార్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు హెచ్చరించారు. శుక్రవారం మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌లో పొర్లు దండాలు పెట్టిన కన్నడ ఒక్కూట నాయకులు  శనివారం బంద్‌కు మద్దతునివ్వాలని విన్నవించారు.   

15వేల మంది పోలీసులతో భద్రత 
రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. దాదాపు 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 33 కేఎస్‌ఆర్‌పీ, 32 సీఏఆర్‌ బెటాలియన్‌లను బందోబస్తుకు నియమించారు.  

దుకాణాలు మూయిస్తే చర్యలు
దొడ్డబళ్లాపురం: శనివారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా బలవంతంగా దుకాణాలు మూయిస్తే ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ రంగప్ప హెచ్చరించారు. బలవంతంగా దుకా ణాలు, ఫ్యాక్టరీలు,కార్యాలయాలు, హోటళ్లు మూయిస్తే అది చట్టవిరుద్ధమవుతుందన్నారు.శాంతియుతంగా బంద్‌ ఆచరించాలన్నారు.

మద్దతు ఇవ్వొద్దు: సీఎం
శివాజీనగర : రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వరాదని ముఖ్యమంత్రి బీ.ఎస్‌.యడియూరప్ప విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ బలవంతంగా బంద్‌ చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.  కన్నడ అభివృద్ధికి మరిన్ని సలహాలు ఇస్తే అమలుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బంద్‌ విరమించుకోవాలని తాను ప్రజా పోరాట నాయకుడు వాటాళ్‌ నాగరాజుకు విన్నవిస్తున్నట్లు చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top