భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.వీ నాగరత్న న్యాయమూర్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వేతనాలకు అనుగుణంగా జీవించలేక ప్రలోభాలకు గురయ్యే న్యాయమూర్తులను తమ పదవులను తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన 22వ వార్షిక రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ నైతికత, స్వతంత్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవల వచ్చిన 2వ పేకమిషన్ సిపారసులను అమలు చేయడం ద్వారా న్యాయమూర్తుల భద్రత మరింతగా మెరుగుపడిందన్నారు. అయితే చట్టబద్దంగా తమకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా జీవించలేక దురాశకు లోనయ్యే న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థ నుండి తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఒక న్యాయమూర్తి చేసే తప్పు కేవలం అతనికి మాత్రమే కాదని పూర్తి న్యాయవ్యవస్థపైనా ప్రభావం చూపుతుందన్నారు. అదే విధంగా న్యాయమూర్తులు కేవలం బయటి వ్యక్తుల నుండే కాకుండా, సహచర న్యాయమూర్తుల నుండి వచ్చే ఒత్తిళ్లకు కూడా లొంగకూడదన్నారు.తీర్పులు ఇచ్చే విషయంలో ఎటువంటి కో ఆర్డినేషన్ ఉండకూడదని ప్రభావితమై న్యాయమూర్తి ఇచ్చే తీర్పు అతని వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనంలా ఉండాలి కాని అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. అదే విధంగా న్యాయవాదులు తాము సమర్పించే తీర్పుల యథార్థతను ధృవీకరించాలని అల్గారిథమ్‌ల ప్రభావం నుండి న్యాయవ్యవస్థకు విముక్తి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
కోర్టులలో మహిళా న్యాయమూర్తులకు భద్రత, గౌరవం మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం న్యాయవ్యవస్థకు అత్యంత అవసరమన్నారు. హైకోర్టులు మరియు జిల్లా న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు మరియు సెలవుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
మెుత్తంగా న్యాయం అనేది కేవలం యాంత్రికంగా కాకుండా, మానవత్వంతో కూడిన విచక్షణతో జరగాలని ఆమె తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కాగా జస్టిస్ నాగరత్న ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2027 సెప్టెంబరులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్ర్య భారత చరిత్రలో మెుట్ట మెదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డు సాధిస్తారు.


