‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’ | Houthis threaten Bab al-Mandeb closure after Iran shuts Hormuz | Sakshi
Sakshi News home page

‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’

Apr 19 2026 8:18 PM | Updated on Apr 19 2026 9:14 PM

Houthis threaten Bab al-Mandeb closure after Iran shuts Hormuz

సనా: అమెరికాకు యెమెన్‌ హౌతీలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యూహాత్మక బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర దేశాలు.. శాంతికి అడ్డుగా ఉన్న చర్యలు, విధానాలను ఆపకపోతే తాము జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు.

శాంతికి ఆటంకం కలిగించే పనులను ఆపకపోతే ముఖ్యమైన సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు. విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వారు (ప్రాక్సీ ఫోర్సెస్) బాబ్ అల్-మండెబ్ నియంత్రణకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని తెలిపారు.

హౌతి ఉప విదేశాంగ మంత్రి హుస్సేన్ అల్-ఎజ్జీ ఎక్స్‌లో ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశారు. యెమెన్‌ ప్రభుత్వం ఆ జలసంధిని మూసేయాలని నిర్ణయిస్తే, ఎవరూ దాన్ని మళ్లీ తెరవలేరని తెలిపారు. అమెరికా, ఇతర దేశాలు వెంటనే తమ తీరును మార్చుకుని యెమెన్ ప్రజల హక్కులను గౌరవించాలని చెప్పారు.

ప్రపంచానికి ఎంతో కీలకం

  • ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువ దారిలో వెళ్లే నౌకలకు చాలా ముఖ్యమైన మార్గం బాబ్ అల్-మండెబ్ జలసంధి.

  • ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు, రెండు చిన్న మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలి.

  • ఇది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఒకటి. చమురు, ఇంధనం వంటి వస్తువులు గల్ఫ్ నుంచి యూరప్, ఆసియా దేశాలకు ఇక్కడి ద్వారానే వెళ్తాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.

  • ఇతర దేశాల మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ మార్గాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ప్రపంచ భద్రతకు ముప్పు ఉంటుందని యెమెన్‌ సర్కారు వార్నింగ్‌ ఇచ్చింది.

  • ఎర్ర సముద్రంలో సమస్యలు వస్తే ప్రపంచ వాణిజ్యం, నౌకల రాకపోకలు నేరుగా ప్రభావితం అవుతాయి.

  • అమెరికా చర్యలకు ప్రతిగా ఇప్పటికే ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధిని మూసేసింది. 

  • బాబ్ అల్-మండెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సుయూజ్ కాలువ ద్వారా ఆసియా-యూరప్ మధ్య నేరుగా వాణిజ్యాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. దీంతో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

  • ఈ జలసంధి ఎర్ర సముద్రం దక్షిణ చివరలో ఉంది. యెమెన్ జిబౌటి, ఎరిట్రియా (ఆఫ్రికా ఖండం) మధ్యలో ఉంది.

  • గేట్‌ ఆఫ్‌ టియర్స్‌ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా నౌకా ప్రమాదాలు జరిగాయి.

  • సుయజ్ కాలువ (1869లో ప్రారంభం) తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఆసియా-యూరప్ వాణిజ్యం ఆఫ్రికా చుట్టూ తిరగకుండా నేరుగా ఈ మార్గం గుండా సాగుతుంది.

  • చమురు, గ్యాస్, వాణిజ్య సరుకులు సరఫరా అవుతాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.

ఈ నేపథ్యంలోనే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలు ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇది జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లకు పెద్ద దెబ్బ తగులుతుంది, అలాగే సుయేజ్ కాలువ ఆదాయం కూడా తగ్గిపోతుంది.

ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం ఇదే. చమురు రవాణాలో కీలక పాత్ర దీనిది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్ దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి. బాబ్ అల్-మండెబ్ జలసంధి ఒక “లైఫ్‌లైన్” లాంటిది. ఇది మూసివేస్తే, ఆసియా-యూరప్ మధ్య వాణిజ్యం, చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది.


భారత్‌కు ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • భారత్ దిగుమతి చేసే చమురు పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ఈ మార్గం మూసితే సరఫరా ఆలస్యం అవుతుంది.
  • మార్గంలో ఆటంకాలు ఎదురైతే రవాణా ఖర్చు పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి.
  • యూరప్, ఆఫ్రికా దేశాలతో భారత వాణిజ్యం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. దీన్ని మూస్తే సరుకు రవాణా దెబ్బతింటుంది.
  • నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. సమయం, ఖర్చు పెరుగుతుంది.
  • ఈ ప్రాంతంలో కాల్పులు, దాడులు ఉంటే భారత నౌకలు ప్రమాదంలో పడతాయి.
  • భారత సముద్ర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ మార్గాల్లో పనిచేస్తారు. వారి భద్రత సమస్యగా మారుతుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement