జేపీసీకి జమిలి బిల్లులు | JPC to have 39 members: One Nation One Election Bill | Sakshi
Sakshi News home page

జేపీసీకి జమిలి బిల్లులు

Dec 21 2024 4:26 AM | Updated on Dec 21 2024 4:26 AM

JPC to have 39 members: One Nation One Election Bill

తీర్మానాలను ఆమోదించిన పార్లమెంట్‌ ఉభయ సభలు  

39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ  

లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మందికి స్థానం   

కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియామకం

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా మరో ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు సిఫార్సు చేయడానికి పార్లమెంట్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ రెండు వేర్వేరు తీర్మానాలను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

ఉభయ సభలు ఈ తీర్మానాలను ఆమోదించాయి. జమిలి ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున తదుపరి పరిశీలన నిమిత్తం జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రెండు బిల్లులను సమగ్రంగా పరిశీలించడానికి, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడానికి జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అనుకున్నట్లుగానే జమిలి బిల్లులపై తదుపరి అధ్యయనానికి 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ, కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది. వివిధ పార్టీ ల ఎంపీలు సైతం జేపీసీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఈ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ పి.పి.చౌదరిని నియమించారు.   కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్‌ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, పి.పి.చౌదరి, మనీశ్‌ తివారీతోపాటు ప్రియాంకగాంధీ వాద్రా, బన్సూరీ స్వరాజ్, సంబిత్‌ పాత్రా, హరీశ్‌ బాలయోగి తదితరులను జేపీసీ సభ్యులుగా నియమించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ వి.విజయసాయిరెడ్డిని జేపీసీ సభ్యుడిగా నియమిస్తూ రాజ్యసభ సెక్రటేరియేట్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ నుంచి జేపీసీలో చోటు దక్కిన వారి పేర్లను చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వెల్లడించారు. విజయసాయిరెడ్డితో పాటు ఘన్‌శ్యామ్‌ తివారీ, భువనేశ్వర్‌ కలిత, కవిత పాటిదార్, సంజయ్‌ కుమార్‌ ఝా, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, ముకుల్‌ బాలకృష్ణ వాస్నిక్, సాకేత్‌ గోఖలే, పి.విల్సన్, సంజయ్‌సింగ్, మానస్‌ రంజన్‌ మంగరాజ్, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ జేసీపీలో సభ్యులుగా ఎంపికయ్యారు.

తెలంగాణకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నుంచి కేఆర్‌ సురే‹Ùరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసార«థి, దీవకొండ దామోదర్‌రావు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేపీసీలో ఒక్కరికైనా చోటు దక్కుతుందని ఆశించిన బీఆర్‌ఎస్‌కు భంగపాటు ఎదురయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయసాయిరెడ్డి, హరీశ్‌ బాలయోగి, తెలంగాణ నుంచి కె.లక్ష్మణ్‌ జేపీసీకి నామినేట్‌ అయ్యారు.  

ఎన్డీయే నుంచి 22, ఇండియా నుంచి 10 మంది  
జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ (2), తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్‌సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ–యూ(1), ఆర్‌ఎల్డీ(1), ఎల్‌జేఎస్పీ–ఆర్‌వీ(1), జేఎస్పీ(1), శివసేన–ఉద్ధవ్‌(1), ఎన్సీపీ–శరద్‌ పవార్‌(1), సీపీఎం(1), ఆమ్‌ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు. అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీని నామినేట్‌ అయ్యారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోక్‌సభకు సమరి్పంచాల్సి ఉంటుంది.

గొప్ప గౌరవంగా భావిస్తున్నా: విజయసాయిరెడ్డి  
‘‘జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి నామినేట్‌ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, పాలనా సామర్థ్యాన్ని పెంచడానికి, మన రాజకీయ నాయకుల జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి, జాతీయ ప్రయోజనాలకు తోడ్పడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అంటూ విజయసాయిరెడ్డి గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  

జమిలిని కచి్చతంగా వ్యతిరేకిస్తాం: జైరామ్‌ రమేశ్‌  
జమిలి ఎన్నికలను కచ్చితంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నికలు దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధమని  తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక, సమాఖ్య వ్యతిరేక ఎన్నికలు మనకు అవసరం లేదని అన్నారు. జమిలి బిల్లులు నెగ్గాలంటే లోక్‌సభలో 272 మంది సభ్యుల మద్దతు అవసరమని చెప్పారు. అంతబలం మోదీ ప్రభుత్వానికి లేదని, బిల్లులు ఆమోదం పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement