
భారత ఒలింపిక్ సంఘంలో లోపాలను సరిదిద్దుకోండి
మీ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, డోపింగ్‌పైనా దృష్టిపెట్టండి
2036 ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలన్న భారత్
ప్రతిపాదనపై ఐఓసీ ఘాటు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలనుకున్న భారత్ ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లుచల్లింది. ఈ విషయంలో భారత్‌కు ‘కనువిప్పు’ కలిగే రీతిలో సుతిమెత్తగా మందలించింది. ముందు మీ ‘ఇంటి’ని చక్కదిద్దుకోవాలంటూ చురకలంటించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సంస్థాగత పాలనా వైఫల్యాలు, లోపాలు, అవినీతి తాండవిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని సరిదిద్దుకోవాలంటూ హితవు పలికింది.
అలాగే ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలు, డోపింగ్‌లో వారు పట్టుబడుతున్న వ్యవహారాలపైనా దృష్టిసారించాలని సూచించింది. స్విట్జర్లాండ్‌లోని లుసానేలో ఇటీవల నిర్వహించిన సమావేశానికి హాజరైన గుజరాత్ హోం, క్రీడల మంత్రి హర్‡్ష సంఘ్వీ, ఒకప్పటి భారత పరుగుల రాణి, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందానికి ఐఓసీ తేలి్చచెప్పింది.
ఐఓసీతో చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతోపాటు పలు ఆంగ్ల వార్తా వెబ్‌సైట్లు ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. అయితే భవిష్యత్తులో విశ్వక్రీడల నిర్వహణ కోసం భారత్ తన ప్రయత్నాలను కొనసాగించొచ్చని ఐఓసీ సూచించింది. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రూ. 470 కోట్ల ఖర్చుచేసి 117 మంది క్రీడాకారులను పంపినప్పటికీ మనకు కేవలం 6 పతకాలే లభించాయి.
దీనికితోడు స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఐఓఏకు అందించే గ్రాంట్లను ఐఓసీ గతేడాది అక్టోబర్ నుంచి నిలిపేసింది. మరోవైపు ఐఓఏ సీఈవోగా రఘురాం అయ్యర్ నియామకంపై అంతర్గతంగా కుమ్ములాటలు నెలకొన్నాయి. కాగా, ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2023 నాటి గణాంకాల ప్రకారం డోపింగ్ కేసుల్లో అత్యధికం భారత్‌వే.
అర్హతలు ఉన్నా ఇవేం వ్యాఖ్యలు..
భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఐవోసీ కావాలనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తోందని భారత ప్రతినిధి బృందం వ్యాఖ్యానిస్తోంది. భారత్‌లో వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నారని.. వారంతా ప్రతిభావంతులేనని స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ కమిటీ దృష్టికి ఐవోఏ తీసికెళ్లినట్లు తెలిసింది. మరోసారి జరిగే సమావేశంలో ఈ అంశంపై తాము చర్చిస్తామని భారత కమిటీ పేర్కొంది.