బెంగాల్ రణక్షేత్రం
29వ తేదీన పోలింగ్
బెంగాల్ భవితవ్యాన్ని తేల్చనున్న దక్షిణాది జిల్లాలు
142 స్థానాల్లో హోరాహోరీ పోరు
సింగూరు నుంచి భవానీపూర్ వరకు ఉత్కంఠ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర భవితవ్యాన్ని, రాబోయే ఐదేళ్ల అధికార పీఠాన్ని శాసించే అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 152 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియగా..29న మిగిలిన 142 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
ముఖ్యంగా దక్షిణ బెంగాల్, కోల్‌కతా, హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో జరగనున్న ఈ పోరును అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. దశాబ్దన్నర కాలంగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలని దీదీ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎలాగైనా కోటను బద్దలు కొట్టి తీరాలని కమలనాథులు వ్యూహాలకు పదును పెట్టారు.
సమరానికి సై అంటున్న కీలక నియోజకవర్గాలు ఇవే.. : రెండో దశలో అర్బన్, సెమీ–అర్బన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఆయా పార్టీల నైతిక స్థైర్యాన్ని నిర్ణయించనున్నాయి.
→ సింగూరు (హూగ్లీ జిల్లా): బెంగాల్ రాజకీయాల్లో సింగూరుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన చారిత్రక పోరాటం టీఎంసీని అధికారంలోకి తెచ్చింది. అయితే, ఇక్కడ ఇప్పుడు పారిశ్రామికీకరణ, ఉపాధి లేమి ప్రధాన సమస్యలుగా మారాయి. ఈసారి ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో, సింగూరులో మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా లేక అభివృద్ధి నినాదం నెగ్గుతుందా అనేది ఆసక్తికరం.
→ భవానీపూర్ (కోల్‌కతా): ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత పట్టున్న వీఐపీ నియోజకవర్గం. ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా కొనసాగించడం టీఎంసీకి ప్రతిష్టాత్మకం. ఈ స్థానంలో మెజారిటీ తగ్గకుండా చూసుకునే బాధ్యతను టీఎంసీ అగ్రనాయకత్వం భుజాన వేసుకుంది.
→ డైమండ్ హార్బర్ (దక్షిణ 24 పరగణాలు): మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట ఇది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
→ టోలీగంజ్ (కోల్‌కతా): టాలీవుడ్ (బెంగాలీ సినిమా) పరిశ్రమకు గుండెకాయ లాంటి ఈ నియోజకవర్గంలో గ్లామర్‌తో పాటు రాజకీయ వేడి ఎక్కువే. ఇక్కడ సినీ ప్రముఖుల ప్రభావం ఎక్కువ. ఇరు పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి.
→ హౌరా సెంట్రల్, శివపూర్ (హౌరా జిల్లా): పారిశ్రామిక ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో కార్మికులు, మైనార్టీ ఓటర్లు కీలకం. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు, మౌలిక
సదుపాయాల లేమిని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి.
→ జాదవ్‌పూర్, కసబ (కోల్‌కతా పరిసరాలు): విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తుండగా.. ఐటీ, ఉపాధి నినాదంతో, నూతన టెక్ పార్కుల ప్రగతితో టీఎంసీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
టీఎంసీకి కలిసొచ్చే అంశాలు.. సవాళ్లు
మమతా సర్కార్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన కేడర్ అతిపెద్ద ఆయుధం. ముఖ్యంగా ‘లక్ష్మీర్ భాండార్’, ’కన్యాశ్రీ’లాంటి మహిళా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారాయి. మహిళా ఓటర్లు ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే, స్థానిక నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు (ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం), సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగానే వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకత వారికి ప్రధాన సవాల్.
బీజేపీ ఆశలు.. ఆందోళనలు
ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంలో, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమవుతోంది. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలను ఎండగడుతూ మెజారిటీ వర్గాలను ఏకం చేసే వ్యూహం అమలు చేస్తోంది. అయితే, దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ప్రధాన లోపం.
(ఆచార్య శరత్ చంద్ర ముక్తవరం)


