అప్నా నంబర్‌ ఆయేగా | Sakshi
Sakshi News home page

అప్నా నంబర్‌ ఆయేగా

Published Wed, Apr 24 2024 5:00 AM

Indians have new shoe sizing system as Bha - Sakshi

యూకే, యూఎస్‌ నంబర్లకు చెల్లు.. 

త్వరలో ‘భా’ పేరిట అమల్లోకి భారత ఫుట్‌వేర్‌ సైజుల విధానం

మీ షూ సైజు ఎంత? యూకే సైజులో అయితే ఈ నంబర్‌.. యూఎస్‌ సైజులో అయితే ఈ నంబర్‌ అని చెబుతాం.. చాలా చెప్పుల షాపుల్లో ఈ నంబర్లే నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? మన పాదాల సైజు గురించి చెప్పేందుకు.. వేరే దేశాల నంబర్లపై ఎందుకు ఆధారపడుతున్నామో.. మన దేశానికి సొంత ఫుట్‌వేర్‌ సైజుల నంబర్‌ ఎందుకు లేదో? ఇకపై ఆ సీన్‌ మారనుంది. ఎందుకంటే.. త్వరలోనే అప్నా నంబర్‌ బీ అయేగా.. 

అప్పుడెప్పుడో బ్రిటిష్‌వాళ్లు.. 
దేశానికి స్వాతంత్య్రం ముందు బ్రిటిష్‌ వాళ్లు వారి ఫుట్‌వేర్‌ సైజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సగటు భారత మహిళ 4 నుంచి 6 సైజుల మధ్య ఉండే పాదరక్షలను ధరిస్తోంది. అలాగే సగటు పురుషుడు 5 నుంచి 11 సైజుల మధ్య ఉండే ఫుట్‌వేర్‌ను వేసుకుంటున్నాడు. అయితే భారతీయుల అవసరాలకు అనుగుణంగా పాద రక్ష ల కొలతల వివరాలు లేవు.. దీంతో ఇప్పటివరకు మనకంటూ ప్రత్యేక విధానం లేకుండాపోయింది.

అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారత్‌లో ఏటా సగటు భారతీ యుడు 1.5 జతల పాదరక్షలను కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఎన్ని కోట్ల జతలో చూడండి.  అలాగే షూ తయారీపరంగా కూ డా భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కానీ ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా వచ్చే పాదరక్షల్లో 50 శాతం తమకు సరిపో వట్లేదని వినియోగదారులు తిరస్క రిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.

ఈ నేపథ్యంలో భారత ఫుట్‌వేర్‌ సైజుల విధానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యా ప్తంగా ఇటీవల భారతీ యుల పాదాల సైజులపై ఓ సర్వే జరి గింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండిస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ ఐఆర్‌) పరిధిలోని సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ) ఈ అధ్యయనం చేపట్టింది.

ఈ సైజుల విధానానికి ‘భా’(భారత్‌) అనే పేరు పెట్టాలని భావిస్తు న్నారు. దేశంలో ఫుట్‌వేర్‌ తయారీకి ఇకపై ఈ సైజులే కొల మానం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న యూకే/ యూరో పియన్, యూఎస్‌ సైజులను ‘భా’ భర్తీ చేయనుంది.

సర్వేలో ఏం తేలింది?
భారత్‌లో వివిధ జాతుల ప్రజలు ఉండటం.. పైగా.. ఈశాన్య భారతానికి చెందిన ప్రజల పాదాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల పాదాలకన్నా కాస్త చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. దేశంలో కనీసం 5 రకాల ఫుట్‌వేర్‌ సైజుల పద్ధతి అవసరమ వుతుందని ఈ సర్వేకు ముందు భావించారు. తర్వాత అందరికీ ఒకే ఫుట్‌వేర్‌ సైజు సరిపోతుందని తేల్చారు. 2021 డిసెంబర్‌ నుంచి 2022 మార్చి మధ్య దేశవ్యాప్తంగా  లక్ష మంది ప్రజల షూ కొలత లకు సంబంధించి సర్వే నిర్వహించారు.

పాదాల సైజు, వాటి నిర్మాణ తీరు, సగటు భారతీ యుల పాదాల ఆకారం గురించి మరింత మెరుగ్గా అర్థం చేసు కొనేందుకు 3డీ ఫుట్‌ స్కానింగ్‌ మెషీన్లను సర్వే కోసం ఉపయోగించారు. దీని ప్రకారం సగటు భారతీయ మహిళ పాదం 11 ఏళ్ల వయసులోనే గరిష్ట సైజుకు చేరుకుంటుందని తేలింది. అలాగే సగటు పురుషుడి పాదం 15 లేదా 16 ఏళ్లకు గరిష్ట సైజుకు చేరుకుంటోందని వెల్లడైంది.

అలాగే భారతీయుల పాదాలు యూరోపియన్లు లేదా అమెరికన్ల పాదాలకన్నా వెడల్పుగా ఉంటాయని సర్వే నిర్ధారించింది. ఇన్నేళ్లుగా యూకే, యూరోప్, యూఎస్‌ పాదాల సైజుల ప్రకారం వెడల్పు తక్కువగా ఉండే ఫుట్‌వేర్‌ తయార వుతుండటంతో భారతీయు లంతా ఇప్పటివరకు బిగుతుగా ఉన్న పాదరక్షలు ధరిస్తున్నారని.. బిగుతుగా ఉండటంతో కొందరు తమ పాదాల కన్నా పొడవైన పాదరక్షలు కొనుక్కుంటున్నారని తేలింది.

ముఖ్యంగా హై హీల్స్‌ వాడే మహిళలు వారి పాదాల సైజుకన్నా పెద్దవైన హైహీల్స్‌నే వాడుతు న్నారని..  ఇవి అసౌకర్యంగా, గాయాలకు దారితీసేలా ఉన్నాయని కూడా సర్వేలో వెల్లడైంది. ఇక మగవారైతే షూ వదులుగా ఉండకుండా చూసుకొనేందుకు లేస్‌లను మరింత గట్టిగా కడుతున్నారు.

ఇది షూ ధరించే వారిలో సాధారణ రక్త ప్రసరణను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, షుగర్‌ వ్యాధితో బాధపడేవారు ఇలా తమ సైజులకు నప్పని పాదరక్షలు ధరిస్తూ గాయాల ముప్పును ఎదుర్కొంటున్నారని తేలింది. 

ఈ నేపథ్యంలో ‘భా’ అందుబాటులోకి వస్తే అది వినియోగదారులకు, పాదరక్షల తయారీదారులకు లాభం చేకూర్చనుంది. ఈ సర్వే ఆధారంగా చేసిన సిఫార్సులను కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)కు ఈ సిఫార్సులను పంపింది.

దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్‌కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం కూడా తప్పనుంది. వచ్చే ఏడాదిలో ‘భా’ విధానం అమల్లోకి వస్తుందని అంచనా. 

– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement