
బెంగళూరులో విషాద ఘటన
బెంగళూరు: మృత్యువు ఒక్కోసారి ఎలా కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. బెంగళూరులోని ఓ ఐటీ ఇంజినీరుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అనూహ్యంగా పాము రూపంలో మృత్యువు కాటేసింది. చెప్పులో పాముందని తెలీక వాటిని వేసుకున్న అతను దాని కాటుకు బలయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులో బన్నేరుఘట్టలోని రంగనాథ లేఔట్‌లో జరిగింది. వివరాలివీ.. మంజు ప్రకాష్ (41) శనివారం మధ్యాహ్నం తన చెప్పులను వేసుకుని బయటకెళ్లి వచ్చాడు.
ఇంట్లోకి రాగానే మత్తుగా ఉందంటూ పడుకున్నాడు. సుమారు గంట తరువాత కుటుంబ సభ్యులు ఇంటి వాకిలి ముందు ప్రకాష్ చెప్పులో చనిపోయిన రక్తపింజర పాము పడి ఉండడాన్ని చూశారు. వెంటనే అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా ప్రకాష్ నోట నుంచి నురగలు కక్కుతూ స్పృహతప్పి ఉన్నాడు. ఓ పాదం నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఏడేళ్ల కిందట ప్రకాష్ కాలుకు తీవ్రగాయం కావడంతో అప్పటినుంచి ఆ కాలికి స్పర్శ తక్కువ అని, అందువల్లే పాము కరిచినా తెలుసుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన బన్నేరుఘట్ట అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుందని.. ఇక్కడ పాముల బెడద ఎక్కువని తెలుస్తోంది.