
డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన వైనం
బీచ్‌లో కొట్టుకుపోయిందా, కిడ్నాపైందా?
పోలీసుల గాలింపు, రంగంలోకి ఎఫ్‌బీఐ
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్‌లో తెలుగు విద్యార్థిని (Telugu Student) అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్‌బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యార్థినులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్‌కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్‌కు చేరుకున్నారు.
ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు.
చదవండి: మనిషిని కుక్క షూట్ చేసింది!
దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి (Sridevi) కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్‌ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్‌బీఐ (FBI) కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.
భిన్న కథనాలు
సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment