సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో వేడెక్కనున్న శీతాకాలం | India faces a double whammy of weather with a Super El Nino | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో వేడెక్కనున్న శీతాకాలం

Oct 14 2026 10:00 PM | Updated on Oct 14 2026 10:00 PM

India faces a double whammy of weather with a Super El Nino

భారత్‌లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైన నేపథ్యంలో సూపర్‌ ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో ఈ ఏడాది శీతాకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, హిమపాతం తగ్గవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వ్యవసాయం, నీటి లభ్యత, విద్యుత్‌ వినియోగం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు శీతాకాలంలో చలి తీవ్రత తగ్గి, మంచు కురిసే పరిమాణం కూడా తగ్గితే వ్యవసాయ రంగానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

డిసెంబరులో ఎల్‌నినో తీవ్రత పెరిగే అవకాశం
భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే నెలల్లో ఇది సూపర్‌ ఎల్‌నినో స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబరులో ఎల్‌నినో అత్యంత శక్తిమంతమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఎల్‌నినో బలపడితే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో పాటు వర్షపాతం, హిమపాతం తగ్గవచ్చని అంచనా. దీనివల్ల రబీ పంటల సాగు, నేలలో తేమ నిల్వ ఉండటం వంటి అంశాలు ప్రభావితమవుతాయి. వేసవిలో తాగునీటి లభ్యతపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు.

2027 వేసవి ప్రారంభంలోనూ తీవ్ర వేడి ముప్పు
ఎల్‌నినో ప్రభావం కేవలం శీతాకాలానికే పరిమితం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2027 వేసవి ప్రారంభంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడానికి, నీటి కొరత తీవ్రం కావడానికి, విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరగడానికి ఈ పరిస్థితులు కారణమయ్యే అవకాశం ఉంది.

2015-16 రికార్డును అధిగమిస్తుందా?
ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ప్రస్తుతం బలపడుతున్న ఎల్‌నినో 2015-16లో నమోదైన అత్యధిక స్థాయిని కూడా అధిగమించే అవకాశం ఉంది. దీని ప్రభావం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుపై పడవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే నెలల్లో ఎల్‌నినో ఎంత బలపడుతుంది, దాని ప్రభావం భారత వాతావరణంపై ఏ స్థాయిలో ఉంటుంది అనేది కీలకం. ముఖ్యంగా పంటల సాగు, నీటి నిల్వలు, విద్యుత్‌ అవసరాలపై పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement