ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో వడా పావ్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలంటూ ఓ విద్యార్థి (ఎఫ్డీఏ) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సహనంగా సమాధానమిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో సదరు విద్యార్తికి వివరించారు.
తుకారాంను విద్యార్థి ప్రశ్నిస్తూ “పాఠశాలల్లో వడా పావ్ను నిషేధించారు. కానీ నేను, నా స్నేహితులు దాన్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాం. దీనిపై మీరేమంటారు?” అని అడిగాడు. దీనికి ముండే చిరునవ్వుతో స్పందించారు. “వడా పావ్ తినకపోతే మన జీవితం ఆగిపోదు. దానికి బదులుగా మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే మీరు మరింత ఆరోగ్యంగా, మెరుగ్గా ఎదుగుతారు” అని చెప్పారు.
నూనెలో బాగా వేయించిన చిరుతిళ్లకు దూరంగా ఉండాలని విద్యార్థికి ఆయన సూచించారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా ఉండవని వివరించారు. పిల్లలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు.
వడా పావ్తో మొదలైన వీరి సంభాషణ చైనీస్ స్ట్రీట్ ఫుడ్ వరకు వెళ్లింది. చైనీస్ ఆహార పదార్థాల గురించి విద్యార్థి అడిగినప్పుడు, వాటిలో కొన్నింటిని తయారు చేసేందుకు కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించే అవకాశం ఉందని ముండే హెచ్చరించారు. రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ, చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఓర్పుతో, అవగాహన కల్పించే విధంగా మాట్లాడిన అధికారిని ప్రశంసిస్తున్నారు.
పాఠశాలల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. తుకారాం ముండే జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పాఠశాల క్యాంటీన్లలోనే కాకుండా పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలో వడా పావ్, సమోసాలు, బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, గ్యాస్ కలిపిన శీతల పానీయాల విక్రయాలు, ప్రకటనలు, పంపిణీపై నిషేధం విధించారు.
ఈ ఆదేశాల నేపథ్యంలో పాఠశాల క్యాంటీన్లలో వడా పావ్, సమోసాలు, శీతల పానీయాల స్థానంలో ఇడ్లీ, దోశ, పోహా, ఉప్మా, తాజా పండ్లు, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. పిల్లలకు ఇంటి నుంచి తయారు చేసిన భోజనాన్ని పంపించాలని తల్లిదండ్రులకు సైతం చెబుతున్నారు.
ఇదీ చదవండి: పోలీసులపై మద్రాస్ కోర్టు ఆగ్రహం


