ఉపాధి, నైపుణ్యాభివృద్ధి

India can become 3rd largest economy by skilling youth - Sakshi

ఆర్థిక వృద్ధికి అవే కీలకం: మోదీ

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి తాలూకు ఫలాలు యువత, ఆదివాసీలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకూ చేరేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తి రంగ వృద్ధికి ఊతమివ్వడం, స్వాతంత్య్రానంతరం నిర్లక్ష్యానికి గురైన ఇతర రంగాల్లోనూ ఉపాధి సృష్టికి కృషి చేయడం తమ లక్ష్యమన్నారు.

గుజరాత్‌ ప్రభుత్వం సోమవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్‌ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘దేశంలో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. ఇవి ఉపాధి కల్పించమే గాక లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తినిస్తున్నాయి. స్టార్టప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు కూడా అందజేస్తోంది’’ అని వివరించారు. ‘‘గుజరాత్‌లో గత ఐదేళ్లలో లక్షన్నర మంది యువకులకు ప్రభుత్వోద్యోగాలు లభించాయి. 2023లో మరో పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి’’ అన్నారు.

ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత
ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఆరోగ్య, వైద్య పరిశోధనలపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి సంబంధించిన ఎలాంటి పరికరాలనూ, టెక్నాలజీనీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంసమృద్ధంగా మార్చాల్సిన బాధ్యత దేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఈ దిశగా తామిప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు.

స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లపాటు సమీకృత ధోరణి, దీర్ఘకాలిక విజన్‌ లేమి దేశ వైద్య రంగ వృద్ధికి ముందరి కాళ్ల బంధంగా ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని చెప్పారు. ‘‘నేను ఫార్మా మార్కెట్‌ రూ.4 లక్షల కోట్లకు విస్తరించింది. ప్రైవేట్‌ రంగం, వైద్య విద్యా రంగం మధ్య సరైన సమన్వయముంటే ఇది రూ.10 లక్షల కోట్లకు విస్తరించగలదు. కరోనా కల్లోలం సంపన్న దేశాలను కూడా అల్లాడించింది. దాని దెబ్బకు ప్రపంచమంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో భారత్‌ మాత్రం మరో అడుగు ముందుకేసి వెల్‌నెస్‌పై దృష్టి పెట్టింది.

మనమిప్పుడు ప్రపంచం ముందుంచిన ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ విజన్‌ అందులో భాగమే. మనుషులకే గాక జంతు, వృక్షజాలాలన్నింటికీ ఒకే తరహాలో సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అంతేగాక ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా మా ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటి. అందుకే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద చేపట్టిన చర్యల ద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి’’ అని చెప్పారు. మార్చి 7ను జన్‌ ఔషధీ దివస్‌ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 9,000 జన్‌ ఔషధీ కేంద్రాల వల్ల పేద, మధ్యతరగతి వారికి రూ.20 వేల కోట్ల దాకా ఆదా అయిందన్నారు.

వేసవిలో జాగ్రత్త: మోదీ
రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వా తావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. వేసవి సన్నద్ధత దిశగా చేపట్టిన చర్యలను ఆయన సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్‌సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ సూచించారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top