న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్‌బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం.
కోల్‌కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు.
దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు.


