పాడైతే... పడేయ్‌ బ్రో! | Hyderabadis not interest in repairing things | Sakshi
Sakshi News home page

పాడైతే... పడేయ్‌ బ్రో!

Mar 23 2026 4:07 AM | Updated on Mar 23 2026 4:07 AM

Hyderabadis not interest in repairing things

వస్తువుల మరమ్మతులపై హైదరాబాదీల అనాసక్తి

పాడైన వాటి స్థానంలో కొత్తవి కొనడంపైనే దృష్టి

‘రీప్లేస్‌మెంట్‌’ ట్రెండ్‌లో దేశంలోనే మనం టాప్‌

తాజా అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర అంశాలు

ఒకప్పుడు ఇళ్లలో ఏదైనా వస్తువు పాడైతే ప్రజలు దాన్ని మరమ్మతు చేయించుకొని తిరిగి ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఉపకరణాలను బాగు చేయించుకోవడం కంటే కొత్త వాటిని కొనడానికే నగరవాసులు మొగ్గు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వినియోగదారుల ప్రవర్తన, మరమ్మతుల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించడానికి పర్యావరణ పరిశోధన, ప్రచార సంస్థ టాక్సిక్స్‌ లింక్‌ ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్‌ రాంచీలలో సర్వే చేపట్టింది.

‘స్టిచ్‌ ఇన్‌ టైమ్‌: ఎవాల్యుయేటింగ్‌ కన్జూమర్‌ బిహేవియర్‌ – ఎలక్ట్రానిక్స్‌ రిపేర్‌ యాక్సెసిబిలిటీ’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్‌లో రిపేరింగ్‌ కల్చర్‌ తగ్గిపోతోందని తేలింది. అన్ని ఆదాయ వర్గాల ప్రజల్లోనూ ఇదే ధోరణి ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. వేగవంతమైన వినియోగ సరళిని ప్రతిబింబిస్తూ ఢిల్లీ, హైదరాబాద్‌లలోని అన్ని ఆర్థిక వర్గాలలోనూ’ రీప్లేస్‌మెంట్‌ ట్రెండ్‌’ బలంగా కనిపిస్తోందని పేర్కొంది.

ఓల్డ్‌ డివైజ్‌... పాడైతే డోంట్‌ యూజ్‌...
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వంటి ఐటీ, టెలికం పరికరాల విషయంలో హైదరాబాద్‌లో గణ నీయమైన రీప్లేస్‌మెంట్‌ ట్రెండ్‌ కనిపించింది. పాతబడిన సాంకేతికత, మరమ్మతు ఖర్చుల కారణంగా రూ. లక్ష నుంచి ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తక్కువ ఆదాయ వర్గాల్లో ఐటీ పరికరాల రీప్లేస్‌మెంట్‌ రేటు అత్యధికంగా  85.71 శాతం ఉంది. టోస్టర్లు, మిక్సర్లు, హెయిర్‌ స్ట్రెయిటనర్స్‌ వంటి చిన్న గృహోపకరణాలను 61.54 శాతం మారుస్తుండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండిషనర్ల వంటి పెద్ద విద్యుత్‌ ఉపకరణాలను వాటి అధిక ధరల కారణంగా కొంత ఆల స్యంగా మారుస్తున్నారు.

ఆదాయ స్థాయిలు పెరిగేకొద్దీ వస్తువుల మార్పిడి రేట్లు కూడా పెరుగుతున్నాయి. అధిక ఆదాయ వర్గాలు సౌకర్యానికి, సాంకేతిక ఉన్నతీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రూ. 20 లక్షలకుపైగా సంపాదించేవారు వస్తువుల మార్పిడికే పెద్దపీట వేస్తున్నారు. ఐటీ, టెలికం పరికరాలు, పెద్ద గృహోపకరణాల మార్పిడి రేటు ఆయా ఆదాయవర్గాల్లో 65 శాతంగా ఉంది.

మరమ్మతుల సంస్కృతి తగ్గడానికి కారణాలివే..
గృహోపకరణాలకు మరమ్మతులు చేయించడంలో విడిభాగాల లభ్యత ప్రధాన సమస్యగా ఉంది. 
అధీకృతంకాని మరమ్మతు దుకాణాలు విడిభాగాల కోసం థర్డ్‌ పార్టీలపై ఆధారపడుతుండటంతో నగర వినియోగదారులు ఆయా దుకాణాలను అంతగా విశ్వసించట్లేదు. 

అసలైన విడిభాగాల అధిక ధర, పరిమిత లభ్యత కారణంగా చాలా మరమ్మతు దుకాణాలు నాన్‌–ఒరిజినల్‌ విడిభాగాలపై ఆధారపడుతున్నాయి.
సరైన శిక్షణలేని టెక్నీషియన్లు, పనిచేయని పరికరాల నుంచి విడిభాగాలను సేకరిస్తుండటం లేదా స్థానిక టోకు వ్యాపారులు అనధికారిక మార్కెట్ల నుంచి వాటిని కొనుగోలు చేయడం వల్ల కూడా నగరవాసులు మరమ్మతులవైపు ఆసక్తి చూపించట్లేదు.
సాఫ్ట్‌వేర్‌ లాక్‌లు థర్డ్‌–పార్టీ మరమ్మతులను నిరుత్సాహపరిచే వారంటీలతో వస్తుండటం కూడా మరో కారణం.

రిపేరింగ్‌ రంగానికి మంచి జరగాలంటే...
 అసలైన విడిభాగాలకు థర్డ్‌–పార్టీ మరమ్మతులపై ఆంక్షలను తొలగించాలి.
సాంకేతిక నిపుణులకు ఆధునిక మరమ్మతు పద్ధతులను అందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

ప్రభుత్వ, ప్రైవేట్‌ మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
మరమ్మతులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు లేదా పన్ను రాయితీలు ఇవ్వాలి.
గడువుకు ముందే పరికరాలను మార్చే విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించడం వంటి చర్యలు చేపట్టాలి.

ఈ–వ్యర్థాలను తగ్గిస్తే ముడిపదార్థాల ఆదా..
దేశంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల ఉత్పత్తి 2010లో 34 బిలియన్‌ కేజీలు ఉండగా ప్రస్తుత పెరుగుదలనుబట్టి అది 2030 నాటికి 82 బిలియన్‌ కేజీలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పరికరాలను మార్చడానికి బదులుగా మరమ్మతు చేయించడాన్ని ఎంపిక చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే శక్తిని, ముడి పదార్థాలను ఆదా చేస్తూనే పెరుగుతున్న ఈ–వ్యర్థాల సమస్యను తగ్గించవచ్చని నివేదిక సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement