ఈ రోజు (బుధవారం) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారినాథ్ క్షేత్రం తెరుచుకుంది.దీంతో ఆలయ పరిసరాలన్నీ శివనామాస్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుని దర్శించుకొని తమ జన్మధన్యం చేసుకోవాలని భక్తులంతా ఎంతో భక్తి నిష్టలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేదారినాథ్ యాత్రపై సమగ్రమైన సమాచారం తెలుసుకోండి.
స్థలపురాణం
ఇతిహాసాల ప్రకారం.. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులు "గోత్ర హత్తి", "బ్రహ్మ హత్తి" పాపాల నుండి విముక్తి పొందడానికి పరమేశ్వరుని కోసం కఠిన తపస్సు చేస్తారు. శివుని దర్శనం అనంతరం ఆప్రాంతంలో మొదట పాండవులు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారని ప్రతీతి. అయితే మాములుగా శివలింగాలు గుండ్రంగా ఉంటాయి, కానీ కేదారినాథ్‌లో శివలింగం త్రిభుజాకారంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఇంజినీర్లనే ఆశ్చర్యపరిచిన ఆలయ నిర్మాణం
ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం ఇప్పటికీ ఇంజనీర్లను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లు టన్నుల కొద్దీ బరువు ఉంటాయి. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో, ఆ కాలంలో ఎటువంటి యంత్రాలు లేకుండా ఆ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఈ ఆలయ నిర్మాణానికి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ వాడారు. రాళ్లను అతికించడానికి ఎటువంటి సిమెంట్ లేదా మట్టిని వాడలేదు. ఒక రాయిలో మరొకటి సరిగ్గా సరిపోయేలా అమర్చారు. అందుకే వందల సంవత్సరాల మంచు తుఫానులు ఈ ఆలయాన్ని కనీసం తాకలేకపోయాయి.
భీమశిల
2013లో ఉత్తరఖండ్‌లో మహాప్రళయం వచ్చింది. ఆసమయంలో ఆలయ పరిసరాల్ని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఒక పెద్దరాయి ఆలయ వెనుకభాగంలో వచ్చే ఆగింది. దీంతో వరదల ఆలయాన్ని కనీసం తాకలేకుండా చీలుకుంటూ వెళ్లింది. అంత పెద్ద భారీ జల ప్రళయం సైతం ఆలయాన్ని తాకలేకపోయింది. దీంతో భక్తులంతా ఆ భీమసేనుడే శిల రూపంలో వచ్చి ఈ ఆలయాన్ని రక్షించాడని అంటారు. అందుకే ఆ రాయిని ఇప్పటికీ "భీమ శిల" పేరుతో కొలుస్తారు.
చార్‌ధామ్ యాత్ర
భక్తులంతా ఎక్కువగా ఛార్‌దామ్ యాత్రలో భాగంగా కేదారినాథ్ దర్శనం చేసుకుంటారు. కేదారినాథ్,బద్రినాథ్,యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలను కలిపి ఛార్‌దామ్ యాత్రగా పిలుస్తారు. యమునోత్రి & గంగోత్రి యాత్ర ఏప్రిల్ 19, 2026 అక్షయ తృతీయ రోజున ప్రారంభం కాగా కేదారినాథ్ ఈ రోజు తెరుచుకోనుంది. రేపు బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల దర్శనం నిమిత్తం తెరుస్తారు.

ఆరు నెలలు మాత్రమే దర్శనం
ఛార్ దామ్ యాత్ర సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సముద్రమట్టానికి సుమారు 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. నవంబర్ - ఏప్రిల్ సమయంలో ఉష్ణోగ్రతలు -15°C నుండి -20°C కి పడిపోతాయి ఆలయ పరిసర ప్రాంతాలు దాదాపు 10 నుండి 15 అడుగుల మేర మంచుతో పూర్తిగా కప్పబడిపోతాయి. శీతాకాలంలో కురిసే భారీ మంచు వల్ల కేదారినాథ్‌కు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం వల్ల ప్రయాణం ప్రాణాపాయంగా మారుతుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు.
అద్భుతం
పురాణాల ప్రకారం, ఆలయ ద్వారాలు మూసి ఉన్న ఆరు నెలల కాలంలో మనుషులు కాకుండా దేవతలు స్వామివారికి పూజలు చేస్తారని నమ్మకం. ద్వారాలు మూసే రోజున ఆలయంలో ఒక పెద్ద దీపాన్ని (అఖండ జ్యోతి) వెలిగిస్తారు. ఆశ్చర్యకరంగా, ఆరు నెలల తర్వాత మళ్ళీ తలుపులు తీసినప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.దీంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించి పోతారు.
ఎలా చేరుకోవాలి?
అయితే కేదారినాథ్ ఆలయం ప్రయాణం కొంత కష్టంతో కూడుకున్నది. సాధారణ రవాణా మార్గాలు కేవలం గౌరీకుండ్ వరకే చేరుకుంటాయి. అక్కడి నుంచి ఆలయం వరకూ సూమారు 16 - 18 కిలోమీటర్ల కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. దీనికి దాదాపుగా 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. నడకమార్గం మెుత్తం కొండలు కావడంతో ట్రెక్కింగ్ కొంత కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు గాలిలో ఆక్సిజన్ స్థాయిు తగ్గుతాయి. దీనివల్ల త్వరగా అలసిపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యాత్రకు ప్రారంభించే సమయంలో సైతం అక్కడి వైద్య సిబ్బంది మన ఆరోగ్య వివరాలను తనిఖీ చేస్తారు.
అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి ఉన్ని దుస్తులు , రెయిన్ కోట్ వెంట ఉంచుకోవడం తప్పనిసరి.మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఆక్సిజన్ సపోర్ట్ అందించేలా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నడవలేని వారి కోసం గుర్రాలు లేదా డోలీలు అందుబాటులో ఉంటాయి.దారి పొడవునా ప్రతి కొన్ని కిలోమీటర్లకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయి.హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. కానీ దీనికి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలి.
కేదారినాథ్‌కు రికార్డు స్థాయిలో రిజిష్ట్రేషన్లు
ఈ సారి చార్ ధామ్ యాత్రకోసం రికార్డు స్థాయిలో భక్తులు రిజిష్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 14.5 లక్షల మంది రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఒక్క కేవలం కేదారినాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిష్ట్రేషన్లు చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రోజుకు కేవలం 15 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించినున్నట్లు కమిటీ ప్రకటించింది.


