
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్‌లే అందుకు నిదర్శనం. అయితే బార్‌లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు.
రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్‌కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్‌గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే..
ఆ తాగుబోతు రాజస్థాన్‌కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్‌లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు.
సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్‌లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్‌లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.
ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.