బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ తప్పనిసరి

Hallmark on gold jewelry is mandatory - Sakshi

ఏపీలో 12, తెలంగాణలోని 7 జిల్లాలు సహా దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో కేంద్రాలు 

బీఐఎస్‌ డీజీ ప్రమోద్‌కుమార్‌ తివారి వెల్లడి

పాత నగలను దుకాణదారులకు అమ్ముకోవచ్చు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) ప్రమోద్‌కుమార్‌ తివారి తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లోను, తెలంగాణలోని ఏడు జిల్లాల్లోను ఇకపై విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్కు తప్పనిసరని తెలిపారు. ఆయన బుధవారం వర్చువల్‌గా మీడియా సమావేశంలో మాట్లాడారు. వార్షిక టర్నోవరు రూ.40 లక్షల కన్నా తక్కువ ఉన్న నగల వ్యాపారులను దీని నుంచి మినహాయిస్తున్నామని తెలిపారు. కేంద్ర వాణిజ్య పాలసీకి అనుగుణంగా ఎగుమతి, దిగుమతి ఆభరణాలు, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల ఆభరణాలు, ప్రభుత్వ అనుమతితో బీ2బీ డొమెస్టిక్‌ ఎగ్జిబిషన్ల ఆభరణాలకు కూడా మినహాయిస్తున్నట్లు వివరించారు. గడియారాలు, ఫౌంటెన్‌ పెన్నులు, కుందన్‌ పోల్కి తదితర ప్రత్యేక నగలను కూడా మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆభరణాల విక్రేతలు ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, ఎలాంటి రుసుములు ఉండవని చెప్పారు. ఎగుమతి, దిగుమతిదారులు, టోకు వర్తకులు, పంపిణీదారులు, విలువైన మెటల్‌ వస్తువుల రిటైల్‌ విక్రయదారులు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. చేతివృత్తిదారులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. హాల్‌మార్క్‌ లేని పాత బంగారు నగలు ఇంట్లో ఉంటే వాటిని దుకాణదారులకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఆ బంగారు నగల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైలర్లకు ఆగస్టు చివరివరకు ఎలాంటి జరిమానా విధించబోమని చెప్పారు. హాల్‌మార్కులో ఆరు అంకెలకోడ్, బీఐఎస్‌ మార్కు, ప్యూరిటీ, డెలివరీ ఓచర్లను అమ్మకందార్లకు ఇస్తామన్నారు. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి భాగస్వాములు, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. 

ఏపీలో హాల్‌మార్క్‌ కేంద్రాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు
తెలంగాణలో: మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ (గ్రామీణ), వరంగల్‌ (పట్టణ), రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top