
ఆరు నెలల తర్వాత నిర్ణయిస్తాం
బీఐఎస్ డీజీ ప్రమోద్ కుమార్
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయడాన్ని ప్రభుత్వం ఆరు నెలల తర్వాత పరిశీలిస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి వెండి ఆభరణాలు, వస్తువులకు స్వచ్ఛంద హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. ‘‘దీని ఫలితాలను పరిశీలించేందుకు కనీసం ఆరు నెలల సమయం అవసరం. ప్రస్తుత ప్రక్రియను ఆరు నెల పాటు పరిశీలిస్తాం.
ఆ తర్వాతే తప్పనిసరి చేయాలా? లేదా? అన్నది నిర్ణయిస్తాం’’అని ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. చిన్న వర్తకులు వెండిని కరిగించి ఆభరణాలు తయారు చేస్తుంటారని, వారిని తప్పనిసరి హాల్‌మార్కింగ్ సర్టిఫికేషన్ కిందకు తీసుకురావడం సవాలుగా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందాలంటే పెట్రోల్ పంపుల మాదిరి మౌలిక వసతులు ఉండాలని తివారీ అభిప్రాయపడ్డారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్‌కు సంబంధించి ప్రమాణాలను అభివృద్ధి చేశామని, అవి ముసాయిదా దశలో ఉన్నట్టు చెప్పారు.