జ్ఞానవాపి మసీదు సర్వే: తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్‌ మిశ్రా

Gyanvapi Mosque Survey Advocate Officer Ajay Mishra On Sacking - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో వేటుకు గురైన అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అంటున్నారాయన. 

‘‘నేనేం తప్పు చేయలేదు. విశాల్‌ సింగ్‌ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది. అర్ధరాత్రి 12 దాకా మేం నివేదికను రూపొందించాం. విశాల్‌ చేసే కుట్రను కనిపెట్టలేకపోయా. చాలా బాధగా అనిపించింది. సర్వే గురించి ఎలాంటి సమాచారం నేను బయటపెట్టలేదు’’ అని అడ్వొకేట్‌ అజయ్‌ మిశ్రా పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. కమిటీ సర్వే కొనసాగుతున్న టైంలోనే లీకులు అందించారంటూ వారణాసి కోర్టు మంగళవారం అర్ధాంతరంగా అజయ్‌ మిశ్రాను తప్పించి.. ఆ స్థానంలో విశాల్‌ సింగ్‌ను కొత్త అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. అజయ్‌ మిశ్రా మీద ఫిర్యాదు చేసిందే విశాల్‌ సింగ్‌ కావడం విశేషం. 

‘‘అజయ్‌ మిశ్రా ప్రవర్తన మీద పిటిషన్‌ దాఖలు చేశా. ఆయన ఓ వీడియోగ్రాఫర్‌ నియమించుకుని.. అతనితో మీడియాకు లీకులు ఇచ్చారు. పుకార్లు ప్రచారం చేశారు. నేను నా బాధ్యతగా నా నివేదిక సమర్పించా’’ అని పేర్కొన్నారు విశాల్‌ సింగ్‌. 

ఇదిలా ఉంటే.. వీడియోగ్రాఫర్‌ చేసిన తప్పిదానికి తానేం చేయగలనుంటున్నాడు అజయ్‌ మిశ్రా. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందని హిందూ వర్గం, కాదు.. అది కొలనుకు సంబంధించిన భాగం అని మసీద్‌ నిర్వాహక కమిటీ వాదిస్తున్నారు. ఇక సర్వే కమిటీ మరో రెండురోజుల్లో వారణాసి కోర్టులో తన నివేదికను సమర్పించనుంది.

Gyanvapi Mosque Case: లీకులు చేసినందుకే అడ్వొకేట్‌ కమిషనర్‌ తొలగింపు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top