Gyanvapi Mosque Case: అనూహ్య పరిణామం.. అడ్వొకేట్‌ కమిషనర్‌ తొలగింపు!

Gyanvapi Mosque Filming Varanasi Court Removes Top Official - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’ అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులపాటు అడ్వొకేట్‌ కమిటీ నేతృత్వంలో మసీదు ప్రాంగణంలో వీడియోగ్రాఫిక్‌ సర్వే జరిగిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. సర్వేకు నేతృత్వం వహించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రాను తొలగిస్తున్నట్లు వారణాసి కోర్టు తెలిపింది. సర్వే రిపోర్ట్‌ పూర్తికాకుండానే బయటపెట్టినందుకు ఆయన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అజయ్‌ మిశ్రా సన్నిహితుడు.. మీడియాకు రిపోర్ట్‌ లీక్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది. అంతేకాదు.. ప్యానెల్‌ తన నివేదికను సమర్పించడానికి రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. 

వాస్తవానికి ఈ కమిటీ ఇవాళే (మంగళవారం) వారణాసి కోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నివేదిక ఆలస్యంగా సమర్పిస్తామని అజయ్‌ కుమార్‌ మిశ్రా కోర్టుకు వెల్లడించారు. ఈలోపే ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడడం విశేషం.

సుప్రీంలో..
ఇదిలా ఉంటే.. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్‌ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం వాదనలు జరుగుతున్నాయి. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది హుఫేజా అహ్మది వాదనలు వినిపించారు. మసీదు కమిటీ తరపు సీనియర్ న్యాయవాది అహ్మదీ మాట్లాడుతూ, కమిషనర్ నియామకంతో సహా ట్రయల్ కోర్టు యొక్క అన్ని ఉత్తర్వులపై స్టేను కోరుతున్నట్లు తెలిపారు. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా,  పార్లమెంటుకు విరుద్ధంగా ఉన్నందున ‘స్టేటస్ కో’కు ఆదేశించాలని కోరారు. అంతేకాదు పిటిషనర్ల ఉద్దేశం మసీదును మాయ చేసే కుట్రగా స్పష్టం అవుతోందంటూ కోర్టుకు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top