గుజరాత్‌లో జానపద గాయకుడిపై నిర్వాహకులు నోట్ల వర్షం కురిపించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంప్రదాయ గుజరాతీ హాస్య జానపద ప్రదర్శన జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో జరిగింది. ఈ ప్రదర్శనలో నిర్వాహకులు గాయకుడు గోపాల్ సాధుపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించారు. ఆయన పాడుతుండగానే నోట్లతో ముంచెత్తారు.
నోట్లు కుమ్మరిస్తున్నా..
వైరలవుతున్న ఈ వీడియోలో భక్తులు తనపై నోట్ల సంచులను కుమ్మరిస్తున్నా.. గోపాల్ సాధు ఏమాత్రం చలించకుండా తన హార్మోనియం వాయిస్తూ పాడుతుండటం కనిపిస్తుంది. ఆ నోట్ల కుప్ప ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే.. ఆయన దాదాపుగా కనిపించకుండా పోయారు. స్టేజీపై ఆయన చుట్టుపక్కల ప్రాంతమంతా నోట్లతో నిండిపోయినప్పటికీ.. ఆయన తన ప్రదర్శనను ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఇది చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఈ ఘటనపై చర్చకు దారి తీసింది.
నెటిజన్ల కామెంట్స్..
ఇది నిజమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటారు. కేవలం అలా కూర్చుని నోట్ల వర్షంలో తడిసి ముద్దవ్వడం అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు.. ఆయన సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని ఆశిస్తున్నాను. వాళ్ళు నోట్లు కుమ్మరిస్తున్నా ఆయన పాడుతూనే ఉన్నారంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ డబ్బులో కొంత భాగం పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండంటూ వ్యాఖ్యానించారు.
గతంలోనూ ఇలా..
గుజరాత్‌లో భజన కార్యక్రమాల్లో భక్తులు ఇలా లక్షల రూపాయల నగదును వర్షంలా కురిపించిన వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో వల్సాద్ అగ్నివీర్ గౌ సేవా దళ్ నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తీదాన్ గధ్వీపై రూ.10, 20, 50, 100 నోట్లను వర్షంలా కురిపించారు. అదే విధంగా.. డిసెంబర్ 2022లో గుజరాత్‌లోని నవ్‌సారి గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో కీర్తీదాన్ గధ్వీపై దాదాపు రూ. 50 లక్షల విలువైన నోట్లను కురిపించారు. 2017, 2018లలో కూడా ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి.


