దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ

Gujarat Thief Shed 10 kg Weight to Commit Burglary - Sakshi

దొంగతనం కోసం కఠినమైన డైట్‌ ఫాలో అయి 10 కేజీలు బరువు తగ్గిన దొంగ

దొంగిలించిన సొత్తు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు

గాంధీనగర్‌: ఆరోగ్యంగా, అందంగా ఉండాలని బరువు తగ్గే వారి గురించి చదివాం.. విన్నాం. కానీ దొంగతనం చేయడం కోసం బరువు తగ్గిన వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే ఇది చదవండి. గుజరాత్‌కు చెందిన మోతీ సింగ్‌ చౌహాన్‌ దొంగతనం చేయడం కోసం కఠినమైన డైట్‌ ఫాలో అయ్యి.. మూడు నెలల్లో 10 కేజీల బరువు తగ్గాడు. దొంగతనం అనంతరం పోలీసులకు చిక్కడంతో ఇతగాడి వెయిట్‌లాస్‌ జర్నీ బయటకు వచ్చింది. ఆ వివరాలు.. 

రెండేళ్ల క్రితం భోపాల్‌లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో నిందితుడు మోతీ సింగ్(34) పనిచేసేవాడు. ఈ క్రమంలో మరాడియా ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయి.. సీసీటీవీ కెమరాలు ఎక్కడ ఫిట్‌ చేశారు వంటి వివరాలన్ని మోతీ సింగ్‌కు పూర్తిగా తెలుసు. ఇంటి తలుపులు కూడా ఎలక్ట్రిక్‌వి కావడంతో వాటిని సాధారణ పద్దతుల్లో బ్రేక్‌ చేయడం కష్టమని అర్థం చేసుకున్నాడు మోతీ.
(చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం)

ఈ క్రమంలో కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాలని భావించిన మోతీ.. ఇందుకు తగ్గట్లు తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం మూడు నెలలుగా ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకున్నాడు. ఎందుకిలా అని తోటి పనివారు ప్రశ్నిస్తే.. బరువు పెరుగుతున్నాను.. అందుకే డైటింగ్‌ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. 

ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం.. మరాడియా ఇంట్లో ఉన్న సీసీకెమరాలకు చిక్కకుండా మోతీ ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. అనంతరం తాను దొంగిలించిన సొత్తును ఓ హార్డ్‌వేర్‌ షాపులో 37 లక్షల రూపాయలకు విక్రయించాడు. ఇక మోతీ చర్యలు షాప్‌ ఎదురుగా ఉన్న సీసీకెమరాలో రికార్డయ్యాయి. మరో విశేషం ఏంటంటే ఇదే హార్డ్‌వేర్‌ షాపులో మోతీ దొంగతనానకి ముందు రంపం, తాపీని కొనుగోలు చేశాడు. వీటి సాయంతో మరాడియా ఇంటి వంటగది కిటికీని కత్తిరించి లోపలికి ప్రవేశించి తన పని కానిచ్చాడు.  
(చదవండి: హ్యాండ్సప్‌ అని గన్‌ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్‌!)

అప్పటికే మరాడియా ఇంటి సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో హార్డ్‌వేర్‌ షాప్‌ బయట ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని అరెస్ట్‌ చేశారు. మోతీ నవంబర్ 5న మరాడియా ఇంట్లో 37 లక్షల రూపాయలకు చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మోతీని అరెస్ట్‌ చేసే సమయంలో అతడి వద్ద ఉన్న ఇతర విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా దొంగిలించిన సొత్తే అని పోలీసులు తెలిపారు.

మోతీ సెల్ ఫోన్ లొకేషన్ పోలీసులకు అతడి గురించి సమాచారం ఇచ్చింది. చివరకు మోతీ తన స్వస్థలమైన ఉదయపూర్‌కు పారిపోతుండగా ఎస్పీ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోతీ వద్ద నుంచి చోరీకి గురైన నగదు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top