ప్రభుత్వానికి ట్రిబ్యునళ్లతో పని లేదా?

Government Defends Tribunals Act Despite Supreme Court Rejection - Sakshi

అలాగైతే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయండి

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయి నియామకాల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ట్రబ్యునళ్ల అవసరం లేదనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలంది. ట్రబ్యునళ్లలో ఖాళీలపై అత్యున్నత న్యాయస్థానం దృష్టి పెట్టాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని జస్టిస్‌ ఎస్‌కే కాల్, ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇలాంటి విషయాల్లో కోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించే పరిస్థితులు రావడం అంత మంచిది కాదని కేంద్రానికి హితవు పలికింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధ్యక్షుడు, ఇతర సభ్యుల నియామకం జరగకపోవడం, ట్రిబ్యునల్స్‌లో కనీస మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించి విచారించింది. వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి శాశ్వత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడింది.   

‘కమ్యూనిటీ కిచెన్ల’పై విచారణకు సుప్రీం ఓకే
దేశంలో ఆకలి కేకల నిర్మూలన కోసం కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆరోగ్య, ఆర్థిక రంగాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేయడం చాలా అవసరమని లాయర్‌ అషిమా మండ్లా చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనిపై 27న విచారణ చేపడతామని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top