జోజిల్లా టన్నెల్‌ పనులు ప్రారంభించిన గడ్కరీ

Gadkari formally launches blasting process for Zojila tunnel construction work - Sakshi

న్యూఢిల్లీ: ఆసియాలోని అతి పొడవైన జోజిలా టన్నెల్ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను మేఘా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారి ఏర్పాటవుతోంది. కార్గిల్ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపేలా జోజిలా టన్నెల్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఈ సొరంగం పొడవు 14.15 కి.మీ.లు కాగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇది ఆసియా రెండు దిశలలో పొడవైన సొరంగం. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన ఎంఈఐఎల్ ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే లద్దాఖ్, శ్రీనగర్ మధ్య ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రయాణం దాదాపు 3.30 గంటలు పడుతుంది ఈ రహదారి నిర్మాణంతో 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ లో మంచు కారణంగా స్తంభించింది. జోజిలా సొరంగం నిర్మాణంతో శ్రీనగర్, లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతుంది. (చదవండి: ‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’)

దాదాపు 33 కిలోమీటర్ల జోజిలా రహదారిని 2 విభాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి విభాగంలో 18.63 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి.  రెండో విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ టన్నెల్, రహదారిని నిర్మిస్తోంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎమెర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. 

జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. ముఖ్యంగా శీతాకాలంలో ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా  వృధా అవుతోంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే వ్యయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top