పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం

Published Thu, Feb 10 2022 3:59 AM

Explosives, Gun, Smuggled By Pak Drone, Recovered In Punjab - Sakshi

అమృత్‌సర్‌: పాక్‌ నుంచి వచ్చిన ఒక డ్రోన్‌ పంజాబ్‌లో జారవిడిచిన 4 కిలోల ఆర్‌డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్‌ఎఫ్‌) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్‌ నుంచి వస్తున్న డ్రోన్‌పైకి గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లోని పంజ్‌గ్రైన్‌ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు.

వీటిలో డ్రగ్స్‌ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్‌డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్‌జైన్, మూడు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్‌ కార్డ్, స్టీల్‌ కంటైనర్, నైలాన్‌ తాడు, ప్లాస్టిక్‌ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్‌ తిరిగి పాక్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.   

భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్‌
భారత్‌కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్‌ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్‌ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్‌ ఈఈజెడ్‌లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

Advertisement
Advertisement