కరోనా దెబ్బతో అక్షరాల 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాల తొలగింపు

EPFO Closed Nearly 71 Lakh EPF Accounts In April To December 2020 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్‌డ్రా చేశారు. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల వరకు నగదును ఉప సంహరించుకున్నారు. దాంతోపాటు ఉద్యోగాలను  కోల్పోవడం, వేరే ఉద్యోగాల్లో చేరడం, ఇతర కారణాల వల్ల భారీ స్థాయిలో ఈపీఎఫ్‌ ఖాతాలు తొలగించాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు మధ్యకాలంలో సుమారు 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలు మూసివేసినట్టు కేంద్ర వెల్లడించింది.

రిటైర్‌మెంట్‌ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ 2020 ఏప్రిల్‌లో డిసెంబర్‌లో 71.01 లక్షల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాలను తొలగించింది. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముగిసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల సంఖ్య 71,01,929. అదే 2019 ఏప్రిల్-డిసెంబర్‌లో ఈపీఎఫ్ ఖాతాలను పూర్తిగా మూసివేసిన వారి సంఖ్య 66,66,563 ఉందని మంత్రి తెలిపారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ పథకంలో భాగంగా..
ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (ఎబీఆర్‌వై) పథకం కింద ఫిబ్రవరి 21, 2021 వరకు రూ .186.34 కోట్లు విడుదల చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సామాజిక భద్రతతో పాటు, కొత్తగా ఉపాధి కల్పన, ఉద్యోగాలను సృష్టించడంలో భాగంగా కంపెనీలను ప్రోత్సహించడానికి ఎబీఆర్‌వై పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఎబీఆర్‌వై పథకం కింద 2021 ఫిబ్రవరి 28 వరకు 15.30 లక్షల మందికి ఉద్యోగాలను కవర్ చేస్తూ, 1.83 లక్షల సంస్థలు లేదా కంపెనీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో సమాధామిచ్చారు.

ఇదిలాఉండగా... ఎబీఆర్‌వై పథకంలో భాగంగా భారత ప్రభుత్వం రెండేళ్ల కాలానికిగాను ఉద్యోగుల వాటా (12% వేతనాలు), యజమానుల వాటా (12% వేతనాలు) ఈపీఎఫ్‌ను  చెల్లించనుంది. ప్రభుత్వం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో (ఈటిఎఫ్)  2021 ఫిబ్రవరి 28 వరకు ఈపీఎఫ్‌ఓ రూ .27,532.39 కోట్లు  పెట్టుబడి పెట్టిందని సంతోష్ గంగ్వార్ సభలో పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ఓ 2019-20లో రూ .32,377.26 కోట్లు, 2018-19లో రూ .27,743.19 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు.
(చదవండి:ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top