మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు! అర్పిత ఎవరంటే..

ED Raid At Minister Aide Arpita Mukherjee House 20 Crore Recovered - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED శుక్రవారం నిర్వహించిన దాడులు చర్చనీయాంశమయ్యాయి. ఆ రాష్ట్ర మంత్రికి బాగా దగ్గరైన ఓ మహిళ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రిగా మంత్రి పార్థా ఛటర్జీకి ఆప్తురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 20 కోట్ల విలువైన నగదు బయటపడింది. 

బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ బోర్డులో అవకతవకల నేరాలకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్నారు అధికారులు. బ్యాంక్‌ అధికారుల సాయంతో ఈ డబ్బును లెక్కించారు ఈడీ అధికారులు. మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే ఉన్నాయి. ఇరవైకి పైగా మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అర్పితతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు బయటకు వచ్చాయి.

 

అర్పిత ఎవరంటే.. 
అర్పిత ముఖర్జీని మంత్రి పార్థా ఛటర్జీకి బాగా దగ్గరైన మనిషిగా చెబుతోంది ఈడీ. బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ఆమె ఫేస్‌బుక్‌ బయోలో మల్టీ టాలెంటెడ్‌ అని ఉంది. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్‌ సంఘ’కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించారు.

కోల్‌కతాలో భారీగా దుర్గా పూజలు నిర్వహించే కమిటీ ఇది. ఇక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా ఛటర్జీపై పలు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో టీచర్ల నియామకాలకు సంబంధించి ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణపై దర్యాప్తు కొనసాగుతోంది కూడా. 

ఇదిలా ఉంటే.. ఇదంతా బీజేపీ నడిపిస్తున్న డ్రామా అని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అమరవీరుల దినోత్సవం ర్యాలీ తర్వాతే ఈ దాడులు నిర్వహించడంతో కుట్రపూరిత చర్యగా అభివర్ణిస్తోంది. అయితే బీజేపీ మాత్రం తమ తప్పులు బయటపడడంతో టీఎంసీ ఇలాంటి ఆరోపణలకు దిగుతోందని అంటోంది.

చదవండి: తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top