డీఎంకే మంత్రి అనిత’కు ఈడీ షాక్‌! 

ED Authority Confirms Attachment Of Assets of TN Minister Anitha Radhakrishnan - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే హయాంలో చేసిన తప్పులు.. ప్రస్తుత డీఎంకే మంత్రి అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌ను వెంటాడుతున్నాయి. ఆయన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్తులను అటాచ్‌ చేస్తూ శనివారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌. అన్నాడీఎంకేలో కొన్నేళ్ల పాటూ  ఆ జిల్లా కీలక నేతగా ఆయన చక్రం తిప్పారు. 2001  నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో పశుసంవర్థక, గృహ నిర్మాణ  శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరకు  డీఎంకేలో చేరి ఓటమి ఎరుగని నేతగా తూత్తుకుడిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి రావడంతో ఆయన మత్స్యశాఖ మంత్రి అయ్యారు. 

వెంటాడుతున్న ఈడీ.. 
2001–2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌ గడించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఏడుగురిపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే,  మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదైంది. అయితే దశాబ్దం కాలం ఎలాంటి పురోగతి లేకుండా ఉన్న ఈకేసు.. ఇటీవల మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వర్గాలు అక్రమ సంపాదనతో 160 ఎకరాల స్థలాన్ని ఆయన కొన్నట్లు తేల్చింది.

అలాగే, మరో 18 చోట్ల కూడా స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఆ స్థలాలతో పాటుగా రూ. 6 కోట్ల మేరకు ఉన్న  మరికొన్ని ఆస్తులను అటాచ్‌ చేస్తూ గతంలో ఈడీ వర్గాలు  ఉత్తర్వులు జారీ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ అనిత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే గత నెల మద్రాసు హైకోర్టు  న్యాయమూర్తులు వైద్యనాథన్, జగదీశ్‌ చంద్ర నేతృత్వంలోని బెంచ్‌ ముందు స్టే ఎత్తి వేత కోసం  ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. అనిత తరపు న్యాయవాదులు తమ వాదనను కోర్టుకు వినిపించారు.

అయితే,  స్టేను ఎత్తి వేస్తున్నామని, ఈడీ  విచారణకు ఆదేశిస్తున్నామని కోర్టు ప్రకటించడంతో అనితకు షాక్‌ తప్పలేదు. అస్సలే తూత్తుకుడి డీఎంకే రాజకీయాలు రచ్చకెక్కి ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అనితను చిక్కుల్లో పడేశాయి.ఈ సమయంలో శనివారం ఈడీ మరో అడుగు ముందుకు వేసింది. ఆయనకు చెందిన రూ. 6.54 కోట్ల విలువైన 160 ఎకరాల స్థలం, మరో 18 ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top