రాష్ట్రంలో జూన్‌ 15 నుంచి ఎస్‌ఐఆర్‌ | ECI announces schedule for Phase 3 of SIR in 16 states and 3 UTs | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో జూన్‌ 15 నుంచి ఎస్‌ఐఆర్‌

May 15 2026 5:50 AM | Updated on May 15 2026 5:50 AM

 ECI announces schedule for Phase 3 of SIR in 16 states and 3 UTs

ఏపీ సహా 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం

ఎస్‌ఐఆర్‌ అర్హత తేదీగా 2026 జూలై 1 

జూలై 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి 

వారంతా ఈ ఎస్‌ఐఆర్‌ పరిధిలోకి వస్తారు 

అన్ని పార్టీలు బీఎల్‌ఏలను నియమించుకోవాలి 

జూన్‌ 5 నుంచి 14 వరకు ఎస్‌ఐఆర్‌పై సిబ్బందికి శిక్షణ 

జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోల ఇంటింటి సర్వే  

ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లు 

ఎస్‌ఐఆర్‌లో పాల్గొననున్న 46,397 మంది బీఎల్‌వోలు, 68,868 మంది బీఎల్‌ఏలు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో జూన్‌ 15వ తేదీ నుంచి ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియకు వినియోగిస్తున్న సిబ్బందితోనే ఎస్‌ఐఆర్‌ కూడా నిర్వహించేలా తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. 

5 నుంచి సిబ్బందికి శిక్షణ 
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై జూన్‌ 5 నుంచి 14 వరకు సిబ్బంది, అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు 46,397 మంది బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో)లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెంట్ల(బీఎల్‌ఏ)ను నియమించుకోవాలని సూచించారు.

ఈ ఎస్‌ఐఆర్‌కు అర్హత తేదీని 2026, జూలై 1గా నిర్ణయించారని తెలిపారు. జూలై 1 నాటి­కి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారంతా ఈ ఎస్‌ఐఆర్‌ పరిధిలోకి వస్తారని వెల్లడించారు. జూలై 14 నాటికి రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాలన్నింటి హేతుబదీ్ధకరణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సమర్థంగా నిర్వహించడానికి వీలుగా 2001లో జరిగిన ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ చేస్తున్నామని, ఇప్పటికే 64 శాతం మ్యాపింగ్‌ పూర్తయినట్లు వివరించారు. 

సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల 
ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి  22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో 46,397 మంది బీఎల్‌వోలు, 68,868 మంది బీఎల్‌ఏలు పాల్గొంటారు. సుమారు నాలుగున్నర నెలలపాటు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగనుంది.

తెలంగాణలో జూన్‌ 25 నుంచి ఎస్‌ఐఆర్‌ 
తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ అర్హత తేదీని 2026 అక్టోబర్‌ 1గా నిర్ణయించారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓల ఇంటింటి సర్వే ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత అక్టోబర్‌ 1న తుది జాబితా విడుదల చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement