కర్ణాటకకు చెడ్డపేరు వచ్చింది | DK Shivakumar On Bengaluru Stampede Deaths | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు చెడ్డపేరు వచ్చింది

Jun 6 2025 4:18 AM | Updated on Jun 6 2025 4:18 AM

DK Shivakumar On Bengaluru Stampede Deaths

పిల్లలు చనిపోవడం బాధాకరం

ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌  

బనశంకరి: ‘వందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు.

ఆర్‌సీబీ జట్టు బెంగళూరుకు వస్తుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదని, భారీ సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు, యువత చేరడంతో పరిస్థితి అదుపుతప్పిందని ఆయన తెలిపారు. ‘ఓ బాలుని శవానికి పోస్టుమార్టం చేయరాదని తల్లిదండ్రులు వేడుకున్నారు. కానీ ఇందుకు చట్టం ఒప్పుకోదు’అని చెప్పారు. బీజేపీ నేతల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, బీజేపీ, జేడీఎస్‌ నాయకులు శవాలపై రాజకీయం చేస్తారని డీకే ఆరోపించారు. తొక్కిసలాటకు డీకే బాధ్యుడని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారని చెప్పగా, ఆయనకు తరువాత సమాధానం ఇస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement