ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!

Different Species Of Animals Found By North Ohio Medical University - Sakshi

అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే.

తాజాగా వేల్స్‌ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్‌ ఒహియో మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్‌ డీర్స్‌ అనే ఇండోహయస్‌ జంతువుల నుంచి ఈ వేల్స్‌ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్‌ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్‌ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్‌లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్‌ డీర్‌కు సంబంధించిన శిలాజం లభించింది.


ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్‌ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్‌ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top