
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.
1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు.
👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?
అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది.
సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.
కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.