Delta Plus: 12 రాష్ట్రాలకు డెల్టా ప్లస్‌ వ్యాప్తి

Delta Plus Variant In 12 States - Sakshi

51కి చేరుకున్న కేసులు

తమిళనాడులో తొలి మరణం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఈ కేసులు 12 రాష్ట్రాలకు విస్తరించగా, తమిళనాడులో తొలి మరణం నమోదైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 51కి చేరుకుంటే మహారాష్ట్రలో 22 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి కేసులు నమోదయ్యాయి. ఏపీ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హరియాణాల్లో ఒక్కో కేసు నమోదైనట్టుగా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 45 వేల శాంపిల్స్‌ని పరీక్షించగా 51 కేసులు డెల్టా ప్లస్‌వని తేలినట్టుగా సింగ్‌ తెలిపారు. 

కోవిడ్‌–19 డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ సోకిన వ్యక్తి మరణించడం తమిళనాడులో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మదురైకి చెందిన ఒక వ్యక్తి డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ సోకి మరణించినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో ఇప్పటివరకు తొమ్మిది డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయని చెబుతూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేరేగా ఉన్నాయి. ఇప్పటివరకు మూడే కేసులు నమోదైతే ఇద్దరు కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. చెన్నైలోని 32 ఏళ్ల వయసున్న ఒక నర్సుకి డెల్టా ప్లస్‌ సోకితే, కాంచీపురం జిల్లాలో మరొకరికి సోకిందని వారిద్దరూ కోలుకున్నారని తెలిపారు. మదురైకి చెందిన కోవిడ్‌ రోగి మరణించాక అతని శాంపిల్స్‌ పరీక్షించగా డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ సోకిందని తేలినట్టుగా ఆయన చెప్పారు.  

రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నా డెల్టా ప్లస్‌
రాజస్థాన్‌లో 65 ఏళ్ల మహిళకి డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ సోకింది. రాజస్థాన్‌లో ఇదే తొలి కేసు. ఆమె ఇప్పటికే రెండు టీకా డోసులు తీసుకున్నారు. మేలోనే ఆమె కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ మహిళకి కరోనా పాజిటివ్‌ రావడంతో అది డెల్టా ప్లస్‌ వేరియెంట్‌గా తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్‌పై జాగురూకతతో ఉండాలని రాజస్థాన్‌ సీఎం గహ్లోత్‌ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top