
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న వ్యాఖ్య
న్యూఢిల్లీ: జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పరోక్షంగా సమరి్థంచారు. ఈ విషయంలో దక్షిణ భారత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. సరోగసీ(క్రమబదీ్ధకరణ) చట్టానికి సంబంధించిన దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
సరోగసీ ద్వారా రెండో సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ జంట ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న స్పందిస్తూ... ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. కుటుంబాలు కుదించుకుపోతున్నాయి. జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. దక్షిణాదికి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతోంది. పిల్లలను కంటూనే ఉన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలకు భావిస్తున్నారు.
పార్లమెంట్‌లో ఉత్తరాది ప్రాధాన్యం మరింత పెరుగుతుందని, దక్షిణాది వాటా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు’’అని వివరించారు. ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, మరో బిడ్డ కోసం ఎందుకు ప్రయతి్నస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించారు. జనాభా తగ్గుదల వల్ల చైనాలో ఎన్నో ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాదని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా! అని పిటిషనర్లకు సూచించారు. విచారణను వాయిదా వేశారు.