DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు

DCPCR Asks CBSE To Award Actual Marks Scored In Practicals Not Pro Rata Basis - Sakshi

సీబీఎస్‌ఈకి డీసీపీసీఆర్‌ సూచన

సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాల వెల్లడిలో థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వర్తింపజేయొద్దని సీబీఎస్‌ఈకి ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ (డీసీపీసీఆర్‌) సూచించింది. ఆ విధంగా చేయడం సీబీఎస్‌ఈ సొంత పాలసీకి విరుద్ధమని పేర్కొంది. 12వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై డీసీపీసీఆర్‌ ఈ మేరకు స్పందించింది. పరీక్ష కేంద్రం పొరపాటు వల్ల తన కుమారుడు 2019–20లో గణితం ప్రాక్టికల్‌ పరీక్షకు హాజరు కానట్లు నమోదయిందని, అసెస్‌మెంట్‌లో 20కుగానూ 17 మార్కులు వచ్చాయని విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. అయితే ప్రొ–రాటా (నిష్పత్తి) ప్రకారం 20కు నాలుగు మార్కులు మాత్రమే ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ రీజినల్‌ డైరెక్టర్‌ చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడం సీబీఎస్‌ఈ పాత్ర. పరిధికి మించి అధికారాలు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం’’అని డీసీపీసీఆర్‌ ఛైర్‌పర్సన్‌ అనురాగ్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. డీసీపీసీఆర్‌–2005 చట్టం ప్రకారం.. విద్యార్థి పరీక్షకు హాజరైనప్పటికీ అబ్సెంట్‌గా నమోదు చేయడం వల్ల విద్యార్థి నష్టపోవడమే కాదు అతడి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇంటర్నల్‌ గ్రేడ్‌లు ఒకసారి అప్‌లోడ్‌ చేసిన తర్వాత మార్చడం కుదరదని, విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా హాజరు సరిదిద్దే క్రమంలోనే ప్రొ–రాటా విధానం ప్రకారం ప్రాక్టికల్‌ మార్కులు లెక్కించి 20కు నాలుగు మార్కులు ఇచ్చినట్లు కమిషన్‌కు సీబీఎస్‌ఈ వివరించింది.

విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడో అన్ని మార్కులు ఇవ్వాలని, ప్రొ–రాటా విధానం ప్రకారం ఇవ్వరాదని డీసీపీసీఆర్‌ స్పష్టం చేసింది. మార్కులు తగిన విధంగా ఇవ్వడానికి సీబీఎస్‌ఈ పాలసీని సవరించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. సర్వీసు రూల్స్‌ ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

చదవండి: కోవిడ్‌తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top